ఆంధ్రప్రదేశ్ అగ్రపధాన నిలిచిన నాడే … శ్రీ పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి

సంకల్పం బలంగా ఉన్నప్పుడు… లక్ష్యం ప్రజా ప్రయోజనం అయినప్పుడు… నీ వెంట ఒక్కడూ లేకున్నా… ఒక్కడూ రాకున్నా విజయం సిద్ధించటం తధ్యమని శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరూపించి చూపారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు మాట్లాడేవారంతా తెలుగుతల్లి నీడలో ఒక రాష్ట్రంగా కలిసిమెలిసి జీవించాలని తపించి తపించి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కారకుడైన ఆ అమరజీవి వర్థంతి సందర్భంగా నా పక్షాన జనసేన శ్రేణుల పక్షాన ముకుళిత హస్తాలతో నీరాజనాలు అర్పిస్తున్నాను. త్యాగనిరతి మూర్తీభవించిన శ్రీ శ్రీరాములు గారు పాతికేళ్ల ప్రాయంలోనే భార్య, కుమారుడ్ని కోల్పోయి సంఘజీవిగా మారిపోయి తన జీవితాన్ని దేశం కోసం అర్పించుకోవడం ఆయనలోని త్యాగశీలతను ఈ ప్రపంచానికి చాటుతుంది. సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ శిష్యునిగా సేవలందిస్తున్న సమయంలో “శ్రీరాములు వంటి వారు మరో పదిమంది నాపక్కన ఉంటే ఈ దేశానికి స్వతంత్రాన్ని ఇంకా ముందే తీసుకొచ్చేవాడిని” అని మహాత్ముడు వ్యాఖ్యానించడం శ్రీ శ్రీరాములులోని దీక్షాదక్షతలు ఏ పాటివో అవగతమవుతాయి. శ్రీ శ్రీరాములు గారికి నిరాహారదీక్షలు కొత్తేమీ కావు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆయన కఠోర దీక్ష చేసి ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలుగువాడికి ఒక జాతిగా గుర్తింపు లేక మద్రాసీలు అని పిలుపును సహించలేక ఒక్కడుగా నిరాహార దీక్షను ప్రారంభించి 58 రోజుల పాటు కఠోరంగా దీక్షను కొనసాగించి చివరికి ప్రాణాలు అర్పించారు. ఐదు పదుల వయస్సు నిండకుండానే తెలుగువారి కోసం తాను వెలుగుదివ్వెగా మారారు. ఇంతటి త్యాగ నిరతితో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకునే అవకాశం విజ్ఞులైన ప్రజల చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధితో వెలుగొందుతూ అగ్రపధాన పయనించినప్పుడే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి అని జనసేనాని అన్నారు.