నిర్లక్ష్యమే నిజమైన విషజ్వరం!

* రాష్ట్రంలో విజృంభిస్తున్న జ్వరాలు
* కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
* పారిశుధ్యంపై శ్రద్ధ లేమి
* కొరవడిన ముందుచూపు
* చేష్టలుడిగిన ప్రభుత్వం

సీజన్ మారినప్పుడు జ్వరాలు రావడం సహజమే కావచ్చు…
అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ జ్వరాలు విజృంభిస్తే అది ఘోరం!
ముందుచూపు లేకపోవడం వల్ల పరిస్థితి విషమిస్తే అది మరీ దారుణం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు చాపకింద నీరులాగా వ్యాపిస్తున్నాయి. డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల లాంటి ఆరోగ్యకేంద్రాలతో పాటు ఇతరేత్రా ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇంత జరుగుతుంటే తక్షణ నిర్ణయాలు తీసుకుని యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. పల్లెలు, పట్టణాలు అని లేదు ప్రతి చోట దోమలు విజృంభిస్తున్నా నివారణ చర్యలు కనిపించడం లేదు. వర్షాలకు తోడు ఎక్కడ చూసినా పారిశుద్ధ్య పరిస్థితులు దిగజారిపోయి వైకాపా ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనంగా పరిసరాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కిందటేడాది 1,946 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ మూడు వారాలైనా కాకుండానే 4,311 కేసులు వచ్చాయి. ఇక డెంగీ కేసులు ఇప్పటికే 3,918 నమోదయ్యాయి. ఇలా ఎక్కడ చూసినా డెంగీ, మలేరియా, వైరల్ లాంటి జ్వరాలు పెచ్చుపెరిగిపోవడానికి అసలు కారణాలేంటని విశ్లేషిస్తే… వైకాపా ప్రభుత్వం చేష్టలుడిగిన తత్వం బయటపడుతోంది.
ఈమధ్య వర్షాలకు ఎక్కడ చూసినా పారిశుధ్యం లోపించింది. వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు చోట్ల మంచినీటి పైపులు పగిలి తాగునీరు కలుషితమైంది.
సీజనల్ జ్వరాలు పెరుగుతాయనే ముందు చూపు అధికారులు, నేతల్లో కొరవడడంతో సకాలంలో తగిన చర్యలు తీసుకోలేదు. దానికి తోడు వైద్యుల కొరత కూడా పరిస్థితిని దిగజారుస్తోంది. ప్రభుత్వం ఉదాసీనత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కలిసి ప్రజల పాలిట శాపంగా మారాయి.
* దుస్థితికి దర్పణాలివీ…
విజృంభిస్తున్న జ్వరాల ధాటికి ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేదు. ఉత్తరాంధ్రలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, మన్యం గిరిజన ప్రాంతాలు… ఇలా ఎక్కడ చూసినా జ్వరాలతో బాధపడని కుటుంబాలు లేవనే చెప్పవచ్చు. నిజానికి డెంగీ జ్వరాల నమోదు సరిగ్గా రికార్డులకెక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పరీక్ష చేయించుకుంటే తప్ప నిర్ధరించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల వారు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా వైరల్ ఫీవర్ అనే పేరుతో చికిత్సలు చేస్తున్నారు.
* ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఇంతవరకు దాదాపు 3,107 మలేరియా కేసులు నమోదయ్యాయి. కిందటేడు ఈ సంఖ్య 786 మాత్రమే.
* విజయనగరం జిల్లాలో కిందటేడు మొత్తం 29 మలేరియా కేసులు రికార్డవగా, ఈ ఏడాది ఇప్పటికే 280 మంది బాధితులుగా మారారు.
* డెంగీ కేసులు విశాఖ జిల్లాలో 805, విజయనగరం జిల్లాలో 323 బయటపడ్డాయి.
* మన్య ప్రాంతాల సంగతి చెప్పనే అక్కరలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట సీహెచ్‌సీ పరిధిలో జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పీహెచ్‌సీలకు రోజుకు 20 మంది వరకు జ్వరపీడితులు వస్తున్నారు. జిల్లా కేంద్రంలో రోగుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉంటోంది.
* నర్సీపట్నం, చౌడవరం, పాయకరావు పేట నియోజక వర్గాల్లో ఇంతవరకు 37 డెంగీ కేసులు వచ్చాయి.
* వైరల్‌ జ్వరాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఆగస్టులో 8,316, సెప్టెంబరులో ఇంతవరకు 4,564 కేసులు నమోదయ్యాయి.
* విజయవాడ ఆసుపత్రిలో రోజుకు కనీసం పది మంది వంతున వైరల్‌ జ్వర పీడితులు చేరుతున్నారు.
* ఏలూరు జిల్లా పరిధిలోని ఏజెన్సీ, మెట్ట మండలాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి.
* జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాల రోగులతో కిటకిటలాడుతోంది. ఈ నెలలో ఇంతవరకు 2,200 మంది రోగులు వచ్చారు. ఈ సంఖ్య సాధారణం కంటే నాలుగు రెట్లు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
* నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సైతం వైరల్‌ ఫీవర్లు వణికిస్తున్నాయి. డెంగీ కేసులు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి.
* కోనసీమ జిల్లాలో మురుగుకాల్వల నిర్వహణ సరిగా లేక దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.
* పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల కలుషిత నీరే దిక్కవుతోంది.
* కోస్తా, రాయలసీమల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
ఇలా ఏ ప్రాంతాన్ని తీసుకున్నా జ్వరాలతో పాటు నమోదు కాని మలేరియా, డెంగీ కేసులు నిజానికి వేలల్లో ఉంటాయని వైద్యనిపుణులే ఒప్పుకుంటున్నారు.
* చోద్యం చూస్తున్న జగన్‌ ప్రభుత్వం
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి అయితే ఉదాసీనత చూపించడం లేదా హడావుడిగా ఏవో నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత అవి ఎలా అమలు అవుతున్నాయో పర్యవేక్షించక పోవడం వైకాపా ప్రభుత్వం వ్యవహార శైలిగా మారింది. ఉదాహరణకు పారిశుద్ధ్యం నిర్వహణకు వైద్య సిబ్బంది, పంచాయితీలను అనుసంధానిస్తూ ఒక యాప్‌ను రూపొందించారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను ఆరోగ్య కార్యకర్తలు ఫొటోలు తీసి అప్‌ లోడ్‌ చేయాలన్నారు. ఆఫొటోలన్నీ పంచాయితీ కార్యదర్శికి చేరుతాయి. అక్కడ పారిశుద్ధ్య చర్యలు తీసుకున్నాక తిరిగి ఫొటోలు తీసి పంచాయితీ కార్యదర్శులు యాప్‌లో నమోదు చేయాలి. అయితే ఈ విధానం సరిగా అమలవుతోందో లేదో చూసే పర్యవేక్షణ కరవైంది. దాంతో ఈ మొత్తం వ్యవహారం మొక్కుబడిగా మారిపోయి, అనుకున్న ప్రయోజనం సిద్ధించడం లేదు.
ఎక్కడికక్కడ దోమలు విజృంభిస్తున్నా, ఫాగింగ్‌ సక్రమంగా జరగడం లేదు. చాలా చోట్ల ఈ యంత్రాలు మూలన పడినా తక్షణ మరమ్మతులు చేయడం లేదు.
ఏటా వర్షాలు పడతాయని తెలుసు. గోదావరి వరదలు సైతం వస్తాయని తెలుసు. పారిశుద్ధ్యం క్షీణిస్తుందనీ తెలుసు. దోమలు పెరుగుతాయని, జ్వరాలు విజృంభిస్తాయిని కూడా తెలుసు. కానీ ఈ పరిస్థితులను ముందుగానే ఊహించి నివారణ చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రులలో మందులు, కిట్ల లేమి, వైద్యుల కొరత లేకుండా చూసుకోవాలని మాత్రం ఇటు అధికార యంత్రాంగానికి కానీ, అటు ప్రభుత్వ గణానికి కానీ పట్టలేదు.
అందుకు ఒకటే కారణం…
ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వంలో పేరుకుపోయిన ఉదాసీనత!
పరిపాలన పట్ల నేతలలో లోపించిన నిబద్ధత!
అదే… జగన్ ప్రభుత్వానికి సోకిన నిర్లక్ష్యమనే విషజ్వరం!
ఇది డెంగీ కన్నాప్రమాదకరం! మలేరియా కన్నా భయంకరం!!