డా.బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన నేమూరి శంకర్ గౌడ్

కూకట్పల్లి, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్ నందు గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ
ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్‌రామ్‌, రాజకీయాల్లో ఆచరణవాది, తండ్రి జీవన తాత్విక బాటలో అహింసాతత్వాన్ని పుణికి పుచ్చుకొని, జాతీయోద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని, దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త నినాదంగా మారిన వ్యక్తి, జాతీయ దృక్పథంతో పనిచేస్తూనే దళిత బహుజనోద్ధరణకు పూనుకున్న ప్రజ్ఞావంతుడు జగ్జీవన్‌రామ్, మానవ సమాజమార్పునకు దోహదపడే రాజ్యాంగ మార్గ పద్ధతుల పట్ల బలమైన నమ్మకంతో పనిచేశారు, గొప్ప దేశభక్తుడు, దార్శనికుడు, మానవీయ మూర్తి జగ్జీవన్‌ రామ్ ను ‘భారతరత్న’ వంటి అత్యున్నత పురస్కారంతో దేశం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత, దళిత ధీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు, సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాము. దళిత హక్కుల పరిరక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. ఈ కార్యక్రమంలో తుమ్మల మోహన్ కుమార్, గడ్డం నాగరాజు, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరరావు, మహేష్ రవీందర్, సునీల్, సురేష్, చందు, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.