ఈనెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి కేటీఆర్

తెలంగాణ వ్యాప్తంగా జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజపేటలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఏడేండ్లలో చేసి చూపించామని తెలిపారు.

మరోవైపు ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామని పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం వచ్చినంకనే చెరువులు బాగు పడ్డాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వచ్చిందన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ అందరికీ తెలిసింది. ప్రతి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు. రాజుపేటలో మహిళా సంఘం భవనం నిర్మిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.