సీఎం గారూ… తాడేపల్లిలో సమీక్షలు కాదు… క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూడండి

* ధాన్యం రంగు మారినా కొనుగోలు చేయండి
* తేమ శాతం నిబంధనలను సడలించి రైతులకు న్యాయం చేయండి
* పాత బకాయిలు రూ. 320 కోట్లు వెంటనే చెల్లించండి
* కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్నాటకం
* స్టీల్ ప్లాంట్ కోసం కృష్ణపట్నం పోర్టులో కేటాయించిన బెర్త్ ఏం చేశారు?
* కాకినాడ మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

మాండౌస్ తుపాన్ దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, అందులో 3 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బ తిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే తాడేపల్లిలో కూర్చొని ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా అధికారులతో సమీక్షలు జరపకుండా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ధాన్యం రంగు మారినా కొనుగోలు చేయాలని, తేమ శాతం నిబంధనలు సడలించాలని, గత వ్యవసాయ సీజన్ కు సంబంధించి ధాన్యం బకాయిలు రూ. 320 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన 12న నిర్వహించనున్న జనసేన యువశక్తి కార్యక్రమం పోస్టర్ ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మాండౌస్ తుపాన్ దెబ్బకు రైతాంగం ఎంత నష్టపోయిందో… ధాన్యం కొనుగోలులో క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థ, పాలసీ విధానాల్లో మార్పుల వల్ల అంతే నష్టం జరిగింది. తడిచిన ప్రతి గింజా కొనాలని అధికారులను ఆదేశించామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి గారు… ముందు రైతు భరోసా కేంద్రాల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి. తుపాన్ వస్తుందన్న ఆందోళనతో కొంతమంది రైతులు సొంతంగా రవాణా ఖర్చులు భరించి ఆర్బీకే కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తే ముందు బస్తాలు లేవన్నారు. బస్తాల సమస్యను అధిగమించాక రవాణాకు లారీలు అందుబాటులో లేవంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తేమ శాతం ఉందని వాలంటీర్లు సర్టిఫికేట్లు ఇచ్చి పంపుతున్నా ఆర్బీకే కేంద్రాల్లో అధికారులు రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అన్నమయ్య, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోనూ వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను నష్టానికి అమ్ముకుందామన్నా కొనేవారు లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
* పాత బకాయిలు వెంటనే చెల్లించండి
వరుస ప్రకృతి విపత్తులతో రాష్ట్ర రైతాంగం పూర్తిగా నష్టపోయింది. వాళ్లకు కనీస మద్దతు ధర కూడా అందని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్లను ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. అలాగే గత వ్యవసాయ సీజన్ కి సంబంధించి ధాన్యం బకాయిలు రూ. 320 కోట్లకుపైగా ఉన్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే రూ. 80 కోట్ల వరకు రైతులకు బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే చెల్లించే ఏర్పాటు చేయాలి. ఈసారి కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి కాకుండా వారంలోపే రైతులకు పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో 35 బస్తాలు పండిస్తే 25 బస్తాలు మాత్రమే కొంటామని అధికారులు నిబంధనలు పెడుతున్నారు. వాటిని ఉపసంహరించుకోవాలి. ఎన్ని బస్తాలైనా కొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేశారు.
* ముగ్గురు కృష్ణులు మారినా కడప స్టీల్ ప్లాంట్ ముందుకు వెళ్లలేదు
మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించి, 25 వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని తద్వారా రాయలసీమలో వలసలు నివారిస్తామని శంకుస్థాపన చేసిన సమయంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. ఇప్పటికే ముగ్గురు ఇన్వెస్టర్లు మారినా పునాది రాయి మాత్రం పడలేదు. మొదట లిబర్టీ ఎస్సార్ స్టీల్స్ అనే కృష్ణుడు వచ్చాడు రూ.17 వేల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పాడు. తరువాత స్విట్జర్లాండ్ కు చెందిన మరో కృష్ణుడు రూ. 12 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పాడు. ఆయనా పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు తాజాగా రూ.8 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని మూడో కృష్ణుడుగా జేఎస్ డబ్ల్యూ అనే కొత్త కంపెనీ వచ్చింది. ప్రాజెక్టు ఇన్ని కంపెనీల చేతులు మారడానికి, నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ముఖ్యమంత్రి గారు ప్రజలకు వివరించాలి. అలాగే కడప స్టీల్ ప్లాంటు కోసం కృష్ణపట్నం పోర్టులో ఒక బెర్త్ కేటాయించారు. ఆ బెర్త్ ఎవరికి అమ్మేశారు? దాని వెనుక జరిగిన జగన్నాటకాన్ని ప్రజలను వివరించాలి. ప్రభుత్వ విధానాల వల్ల మోసపోయి ఉపాధి కోసం వలసలు వెళ్లిపోతున్న యువతలో భరోసా నింపడానికే జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఒక్క ఉత్తరాంధ్ర నుంచే లక్షలాది మంది యువత ఉపాధి కోసం వలసలు వెళ్లిపోయారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే ఏడాదికి 25 వేల మంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రానికి, చెన్నై, పారాదీప్ వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. జనసేన పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో వలసల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాం. యువత భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇస్తాం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి రాయితీలు కల్పిస్తాం వంటి అంశాలపై యువశక్తి కార్యక్రమ వేదికపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహిస్తాం” అన్నారు.
* క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఇటీవల రెండు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులను శ్రీ మనోహర్ గారు కాకినాడలో అందజేశారు. తుని నియోజకవర్గం బొద్దవరం గ్రామానికి చెందిన శ్రీ వేగి హేమ కిషోర్ వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు మృతి చెందారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన హేమ కిషోర్ మృతికి సంతాపం తెలుపుతూ పార్టీ తరఫున రూ.ఐదు లక్షల చెక్కును అతని భార్య శ్రీమతి లక్ష్మికీ అందజేశారు. కుటుంబ పరిస్థితిని శ్రీ మనోహర్ గారు అడిగి తెలుసుకున్నారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి గ్రామానికి చెందిన శ్రీ మర్రి రమణ ఇటీవల ప్రమాదంలో మృతి చెందగా ఆయన భార్య శ్రీమతి దేవికి రూ. 5 లక్షల చెక్ అందజేశారు. పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది అని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, నియోజక వర్గాల ఇంచార్జులు, రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, వీర మహిళలు పాల్గొన్నారు.