వాలంటీర్లందరినీ ఉద్దేశించి కాదు

  • వాలంటీర్ల ముసుగులో ఉన్న కొందరు వైసిపి కార్యకర్తల దౌర్జన్యాలు ఖండిస్తున్నాం
  • ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు
  • జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు: గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తవుడుకున్నట్లు కొందరు వాలంటీర్ల ముసుగులో ఉన్న వైసిపి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకునేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారని అందరి వాలంటీర్లను ఉద్దేశించి కాదన్నారు. దీనిని రాజకీయం చేయాలని వైసిపి నేతలు, కార్యకర్తలు వాలంటీర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజల భద్రతకు సంబంధించి వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల దగ్గర ఉందని అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కోణంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు తమ వద్దనున్న సమాచారాన్ని దుర్వినియోగం చేశారని మరి కొంతమంది పింఛన్ సొమ్మును కూడా స్వాహా చేసిన ఉదంతాలు, దౌర్జన్యాలు మహిళలపై దాడులు చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. వైసీపీ సమావేశాలకు రాకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసివేస్తామని బెదిరించిన కొందరు వాలంటీర్లు కూడా ఉన్నారన్నారు ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వైసిపి నేతలు, ఐ ప్యాక్ టీముకు వాలంటీర్లు అందిస్తున్నారని విమర్శించారు. అనేక ప్రాంతాల్లో తాము పర్యటించినప్పుడు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తొలగించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అసలు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులా కాదా అని వాలంటీర్లు ఎలా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ.. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు ఇస్తే పరిపాలనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన లోపాలను ఆయన ఎత్తి చూపారు కొంతమంది వాలంటీర్లు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయన్నారు పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలో బదనాం చేయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కుట్ర చేస్తున్నారని వీరి ఆటలు సాగనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ వాలంటీర్లు కాదు వాలంటీర్ల ముసుగులో ఉన్న కొందరు వైసిపి కార్యకర్తల దౌర్జన్యాలు ఖండిస్తున్నామన్నారు. జిల్లా కార్యదర్శి షేక్ అలియా, నగర కార్యదర్శి దాసరి మాధురి నగర ప్రధాన కార్యదర్శి కంధర, నగర డివిజన్ ఇంచార్జిలు రమణ, శ్రీకాంత్, అనుదీప్, అలెక్, ఉదయ్, కరీం, అజయ్, రేవంత్, నగర నాయకులూ సౌమ్య, సాయి, మని, ప్రవీణ్, మంజుళమ్మ తదితరులు పాల్గొన్నారు.