జగనన్న కాదు.. మోసమన్న అయిపోయాడు

* ఓట్ల కోసం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు
* ఈయన బటన్ నొక్కితే ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో చెప్పాలి
* ఐటీడీఏ లను పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసింది
* 56 కార్పొరేషన్ల వల్ల ఒరిగింది ఏమీ లేదు
* పాలన వదిలేసి వాహనం రంగులు గురించి మాట్లాడడం సిగ్గుచేటు
* పాలకొండ, నరసన్నపేట నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

నాటి జగనన్న నేటి మోసమన్న అయిపోయాడు.. ఓట్ల కోసం ముద్దులు పెట్టి, ఎన్నికల కోసం రకరకాల హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం వాటిని పట్టించుకోని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల సమీక్షలో భాగంగా ఆదివారం సాయంత్రం పాలకొండ, నరసన్నపేట నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “బటన్ నొక్కితే అంతా బాగుపడిపోతుందని ఈ ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈయన బటన్లు నొక్కితే ఎన్ని జీవితాలు బాగుపడ్డాయో.. ఏ ప్రాంతం బాగుపడిందో సీఎం సమాధానం చెప్పాలి. సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలను పూర్తిగా విస్మరించారు. వాటికి కనీస నిధులు రావడం లేదు. 56 కార్పొరేషన్లు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి వాటికి నిధులు ఎంత మేర కేటాయించారో సమాధానం చెప్పాలి. ఈ ప్రాంత యువతలో అంతులేని వేదన దాగుంది. తాజాగా యువత ఉపాధి కార్యాలయంలో తమ సర్టిఫికెట్లు రిజిస్టర్ చేసుకుంటే ఇచ్చే జాబ్ కార్డు సైతం ఆపేయాలని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే రాష్ట్రంలోని యువత నిరుద్యోగంలోనే మగ్గిపోవాలి అని ఈ ప్రభుత్వం భావిస్తుందా..?
* వారాహి రంగుతో అసలు మీకేం సంబంధం?
151 సీట్లు భారీ మెజారిటీ ఇచ్చి వైసీపీని గెలిపించింది వాహనాలు రంగులు గురించి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడడానికా..?పాలన విషయాలు పూర్తిగా పక్కన పెట్టి వారాహి వాహనం రంగు గురించి వాళ్లకెందుకు..? దానిని అతిగా చూపించి పాలనను పక్కనపెట్టి ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ..? శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహనం రంగు కనిపించినా వీళ్లకు భయమే. వ్యక్తిగత దూషణలు, బూతులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోలేకపోయాయి. ఇప్పుడు మీరు చేసే రంగుల రాద్ధాంతం ఆయన దారిని ఏ మాత్రం అడ్డుకోలేదు. ఇంటి మీద జెండా పెడితేనే పింఛను ఆపేసే కుతంత్రమైన పాలన ఆపండి. జనసేన చేసే ప్రజా పోరాటాలు ఈ వైసీపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
* గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక
గతంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నేను స్పీకర్ గా ఉన్న సమయంలో అరకు డిక్లరేషన్ తీసుకొచ్చాను. 170 మంది ఎమ్మెల్యేలను గిరిజన ప్రాంతాలకు తీసుకువచ్చి మూడు రోజులు పాటు ఉండి… గిరిజనుల సమస్యలను పరిశీలించాం. దీనిలో భాగంగానే ఐటీడీఏ ప్రాజెక్టుల్లో యువ ఐఏఎస్ అధికారులు ఉండాలని అప్పట్లో నిర్ణయించాం. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై జనసేన పార్టీకి స్పష్టమైన ప్రణాళిక ఉంది. ప్రకృతిని విధ్వంసం చేయకుండా అభివృద్ధి చేయడం అనేది జనసేన సిద్ధాంతంలో ఒక భాగం. కచ్చితంగా గిరిజనుల పంటలకు కావలసిన మార్కెటింగ్, కోల్డ్ స్టోరేజీలు కట్టించేలా సమగ్ర అభివృద్ధి చేస్తాం.
* ఇక్కడి నాయకులు ఈ ప్రాంతానికి చేసింది సున్నా
ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రస్తుత క్యాబినెట్ లోను కీలకమైన శాఖలు నిర్వర్తించే మంత్రులు ఉన్నారు. అయినా ఈ ప్రాంతం అభివృద్ధి కాదు కదా కనీసం ముందడుగు వేయలేని దుస్థితిలో ఉంది. అద్భుతమైన వనరులు, నదులు ఉన్న ప్రాంతంలో కుటిల రాజకీయ నాయకుల వల్లనే అభివృద్ధి కుంటుపడింది. కేవలం వ్యక్తిగత స్వలాభాలు, ఆస్తులు కోసం నాయకులు నిలబడ్డారు తప్పితే ఈ ప్రాంత ప్రజల వలసల నిరోధం, మత్స్యకారుల సమస్యలు పరిష్కారం మీద వారికి దృష్టి కూడా లేదు.
* గ్రామసభల్లో జనసేన జెండా పట్టుకుని కూర్చోండి
గ్రామాల్లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కచ్చితంగా గ్రామ సభలకు వెళ్ళండి. జనసేన జెండా పట్టుకుని గ్రామ సభలో కూర్చోండి. కచ్చితంగా గ్రామ అభివృద్ధికి ఏం చేస్తున్నారో ప్రశ్నించండి. వారు చెబుతున్న లెక్కలు జాగ్రత్తగా విని దానిలోని లోపాలను గుర్తించి ప్రశ్నించండి. సమాచార హక్కు చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకోండి. కచ్చితంగా పార్టీ మీ వెంట ఉంటుంది. ప్రతి గ్రామానికి సమిష్టిగా వెళ్లి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో చెప్పండి. కచ్చితంగా ప్రజలు స్వాగతిస్తారు. రాష్ట్రంలో ఇంత అధ్వానమైన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. వచ్చే కాలంలో దౌర్జన్యాలు దాస్టికాలు ఇంకా పెరుగుతాయి. బలంగా నిలబడి పోరాడండి. ప్రతి విషయంలోనూ పార్టీ మీకు అండగా నిలుస్తుంది. జనసేన పార్టీ వస్తే కచ్చితంగా జాతీయ నాయకుల విగ్రహాలు, ప్రాంతం కోసం కష్టపడిన వ్యక్తుల విగ్రహాలు పెడతాం. ఇక్కడ యువకులు కోరినట్లు ప్రపంచ ప్రఖ్యాత వస్తాదు శ్రీ కోడి రామ్మూర్తి విగ్రహాన్ని కచ్చితంగా ఆవిష్కరిస్తాం. కష్టపడే మనస్తత్వం ముందుండే మనస్తత్వం ఉన్న ఉత్తరాంధ్ర యువతకు కచ్చితంగా బాసటగా నిలుస్తాం” అన్నారు. సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, శ్రీ ముత్తా శశిధర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, పార్టీ కార్యక్రమాలు నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బోడపాటి శివదత్ తదితరులు ఉన్నారు.
* బీమా చెక్కులు అందజేత
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న ముగ్గురు కార్యకర్తలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారికి పార్టీ నుంచి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బీమా చెక్కులను మనోహర్ గారు అందజేశారు. కవిడి గ్రామానికి చెందిన బుర్ర షణ్ముఖరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయన భార్య శ్రీమతి శారద చెక్కును అందుకున్నారు. ఇచ్చాపురానికి చెందిన తుంగన భాస్కరరావు, తుంగన సాగర్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారికి సంబంధించిన చెక్కులను ఆదివారం మనోహర్ అందజేశారు. దాసరి రాజు, బైపల్లి ఈశ్వర రావు, దుర్యోధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురం నియోజకవర్గం టీడిపి నాయకులు అక్కివరపు మోహన్ రావు, మూడడ్ల వేణు గోపాలస్వామి, తెంటు శంకరరావు, చొక్కాపు వెంకట రమణ, అద్దాల వెంకట్రామరాజులు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు పాల్గొన్నారు.