కేంద్రం చేయూతకు రాష్ట్రం మోకాలడ్డు!

* సోలార్ పంపుసెట్లకు మంగళం
* అటకెక్కిన పీఎం కుసుమ్ యోజన పథకం
* 50 వేల మంది సన్నచిన్నకారు రైతులకు చేకూరని లబ్ది
* అక్షరాలా రూ.450 కోట్ల రాయితీకి దూరం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్లో చాలా భాగం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఉంటుంది. కేంద్రం ప్రవేశ పెట్టే పథకాలకు కొంత రాయితీ అందిస్తుంది. ప్రయోజనం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొంత రాయితీ అందించాలి. ఇలా అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు నడుస్తూ ఉన్నాయి. అనేక రాష్ట్రాలు ఈ పథకాలను చక్కగా వినియోగించుకుంటూ పురోభివృద్ధి సాధిస్తున్నాయి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అవేమీ పట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీతో సోలార్ పంపుసెట్లు అందించే పీఎం కుసుమ్ యోజన పథకానికి ఇక్కడ తూట్లు పొడిచారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 వేల మంది చిన్నసన్నకారు రైతులకు సోలార్ పంపుసెట్లు అందకుండా ఈ పథకానికి మోకాలడ్డారు.
*50 వేల సోలార్ పంపుసెట్లు మంజూరు చేసిన కేంద్రం
2021-22లో పీఎం కుసుమ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం, ఏపీకి 50 వేల సౌర విద్యుత్ పంపుసెట్లను కేటాయించింది. సోలార్ పంపులకు కేంద్రం 30 శాతం, రాష్ట్రం 30 శాతం రాయితీ అందించాలి. మరో 30 శాతం బ్యాంకుల నుంచి రుణంగా అందిస్తారు. రైతులు 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ రాయితీ వాటా 30 శాతం అంటే రూ.225 కోట్లు చెల్లించక పోవడంతో కేంద్రం ఏపీకి కేటాయించిన పంపుసెట్లను రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు అందాల్సిన రూ.450 కోట్ల రాయితీ ప్రయోజనాలు దక్కకుండా పోయాయి.
*ముందు అడిగారు…. తరవాత వదిలేశారు
50వేల సోలార్ పంపుసెట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కేంద్రాన్ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది. 2022 మార్చిలోగా లబ్దిదారులను గుర్తించి వారికి సోలార్ పంపుసెట్లు అందించాల్సి ఉంది. అయితే లబ్దిదారుల ఎంపికకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదు. అసలు 30 శాతం రాయితీ విడుదల చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. దీంతో రైతులకు రావాల్సిన 50 వేల సోలార్ పంపుసెట్లను కేంద్ర రద్దు చేసింది.
*ఒక్కో పంపు సెట్టు విలువ అక్షరాలా రూ. లక్షన్నర
సోలార్ పంపుసెట్లు ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే 20 సంవత్సరాల వరకు రైతులకు సేవలు అందిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కాలుష్యం లేని ఇంధన వనరులను ప్రోత్సహించే ఉద్దేశంలో పీఎం కుసుమ్ పథకానికి రూపకల్పన చేసింది. దేశ వ్యాప్తంగా 24 లక్షల సోలార్ పంపుసెట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఒక్కో రైతుకు లక్షా 50 వేల విలువైన సోలార్ పంపుసెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంత ధర పెట్టి సన్నచిన్నకారు రైతులు కొనలేరు కాబట్టి, యూనిట్ ధరలో కేంద్రం 30 శాతం అంటే రూ.45వేల రాయితీ, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం అంటే మరో రూ.45 వేల రాయితీ ఇవ్వాల్సి ఉంది. బ్యాంకుల నుంచి రూ.45వేల రుణం అందిస్తారు. రైతులు కేవలం రూ.15 వేలు చెల్లిస్తే సోలార్ యూనిట్ అందిస్తారు. ఈ పథకం కింద 2022 సంవత్సరానికి కేంద్రం 50 వేల సోలార్ పంపుసెట్లు కేటాయించింది. లబ్దిదారులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన రాయితీ రూ.225 కోట్లు వెనక్కి పోయాయి.
*రూ. 4 వేల కోట్లు మిగిలేది
వ్యవసాయం దండగ కాదు పండగ చేస్తామని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా అంది పుచ్చుకోకపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 50 వేల మంది రైతులకు ప్రయోజనం దక్కేది. ఒక్కో రైతుకు ఏటా రూ.40 వేలు ఉచిత విద్యుత్ కోసం ఖర్చు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇలా చూసినా 50 వేల మంది రైతులకు సోలార్ పంపుసెట్లు బిగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత విద్యుత్ ఖర్చు ఏటా రూ.200 కోట్లు ఆదా అవుతుంది. ఇలా 20 సంవత్సరాలకు లెక్కిస్తే రూ.4000 వేల కోట్ల ఉచిత విద్యుత్ ఖర్చు ప్రభుత్వానికి కలసి వస్తుంది. ఇలాంటి అద్భుతమైన పథకాన్ని వినియోగించుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు.
*సన్నచిన్నకారు రైతులు సొంతంగా కొనలేరు
లక్షల ఖరీదయ్యే సోలార్ మోటార్లను సన్నచిన్నకారు రైతులు కొనుగోలు చేయలేరు. 5 హెచ్ పి సోలార్ సబ్ మెర్సిబుల్ పంపు ధర రూ.65,000 పైమాటే. ఇక సోలార్ ప్యానళ్లకు రూ.80,000 ఖర్చు అవుతుంది. ఇతర సామాగ్రి మరో రూ.20,000 అవుతుంది. అంటే రైతులు స్వయంగా 5 హెచ్ పి సోలార్ పంపు బిగించుకోవాలంటే రూ.1,65,000 ఖర్చవుతుంది. కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం ద్వారా కంపెనీలు పోటీ పడి ఒక్కో యూనిట్ రూ.1,50,000లకు సోలార్ పంపుసెట్, సోలార్ ప్యానెళ్లు, ఇతర సామాగ్రి మొత్తం అందించడానికి ముందుకు వచ్చాయి.
*మధ్యప్రదేశ్ ఆదర్శం
కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ యోజన పథకం కింద దేశంలోని వివిధ రాష్ట్రాలకు 24 లక్షల సోలార్ పంపుసెట్లు మంజూరు చేసింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో ముందున్నాయి. ఇప్పటికే ఈ ఆరు రాష్ట్రాల్లో 10 లక్షల సోలార్ పంపుసెట్లు బిగించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 30 శాతం రాయితీకి అదనంగా మరో 30 శాతం ఇవ్వాల్సి ఉండగా, దాన్ని మరింత పెంచాయి. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 30 శాతం రాయితీకి, అదనంగా మరో 60 శాతం రాయితీ అందిస్తోంది. అంటే రైతులు కేవలం 10 శాతం భరిస్తే సరిపోతుంది. కానీ ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కేంద్రం ఇచ్చే రాయితీలను కూడా వినియోగించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. మాది రైతు ప్రభుత్వం. వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తామని ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చెప్పిన మాటలు, నీటి రాతలుగానే మిగిలిపోయాయి.
*వైఎస్ఆర్ జలకళకు అనుసంధానం చేసుకోవచ్చు
వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా అర్హులైన చిన్న, సన్నకారు రైతులందరికీ ఉచితంగా బోర్లు తవ్వించి, మోటార్లు బిగిస్తామని ఎన్నికల ముందు జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదే ఈ పథకం ప్రారంభించారు. అయితే వైఎస్సార్ జలకళ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది రైతులకు బోర్లు వేసి, పంపుసెట్లు అందించడంతోపాటు, వాటికి అవసరమైన విద్యుత్ కనెక్షన్ కూడా ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో కేవలం 6555 బోర్లు మాత్రమే తవ్వించారు. వాటికి కూడా విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. కనీసం పంపుసెట్లు కూడా సమకూర్చలేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కుసుమ్ యోజన పథకాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళ కింద తవ్విన బోర్లకు సోలార్ పంపుసెట్లు బిగించడం ద్వారా రైతులకు ప్రయోజనం దక్కుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచన చేయకపోవడం శోచనీయం.