లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్‌ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. మూడు రోజులు పాటు చేపట్టిన దీక్షకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే. మొదటి రోజు గురువారం ఉదయం ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో షర్మిల దీక్షను ప్రారంభించారు. కాగా, సాయంత్రం ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షలో కూర్చున్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని.. 72గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని షర్మిల ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజున రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు.