పార్వతీపురం ఆర్టీసీ డిపోను గాడిలో పెట్టాలి..!

  • విజయవాడ, విశాఖపట్నం బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు
  • మెయింటినెన్స్ లేని డొక్కు బస్సులతో అవస్థలు
  • లైట్లు లేక ఆర్టీసీ ప్రాంగణమంతా చిమ్మ చీకట్లు
  • చీకటి పడితే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డిపో ప్రాంగణం
  • పాలకులు, ఉన్నతాధికారులు కళ్ళు తెరవాలన్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పాలకులు, ఉన్నతాధికారులు కళ్ళు తెరచి పార్వతీపురం ఆర్టీసీ డిపోను గాడిలో పెట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. ఆదివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు అన్నా బత్తుల దుర్గాప్రసాద్, వంగల దాలినాయుడు కొల్లి వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్వతీపురం ఆర్టీసీ డిపో గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. అధికారులు యూనియన్ల సిబ్బంది మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రయాణికులు బలి పశువులు అవుతున్నారన్నారు. కిలోమీటర్ల పెంపు, ఆన్లైన్ టీమ్ ల విషయంలో జరుగుతున్న గొడవలో భాగంగా దాదాపు 30 మంది డ్రైవర్లు విధుల్లో లేక విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే బస్సుల మెయింటెనెన్స్ లేక డొక్కు బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్నారు. స్పేర్ పార్ట్లు కొరత, శాశ్వత మెకానిక్ లు లేకపోవడంతో ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ ప్రమాదానికి గురవుతుందో తెలియక ప్రయాణికులు బిక్కు బిక్కు మంటూ టెన్షన్ పడుతూ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో చీకటి పడితే లైట్లు లేక ప్రాంగణమంతా చిమ్మ చీకటిగా ఉంటుందన్నారు. ఇదే అదునుగా అసాంఘిక శక్తులు తమ అసాంఘిక కార్యక్రమాలకు ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని అడ్డాగా మార్చుకుందని ఆరోపించారు. వర్షం పడితే బస్సులు కారిపోవడం, బస్సులో కనీస వసతులు లేక డొక్కు బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక సిబ్బంది విషయమై ఇంక్రిమెంటు లేక వేధింపులు అధికమై రెస్ట్ రూమ్ లేక అవస్థలు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రమయ్యాక ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఆశతో ఉన్న ప్రయాణికులకు నిరాశే ఎదురవుతుందన్నారు. కూనేరు, సర్వపాడు, రాజ్యలక్ష్మి పురం తదితర ప్రాంతాలకు గతంలో నడిచే బస్సులు ఇప్పుడు లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయిస్తున్నారని, అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సేవలు అద్వానంగా ఉన్నాయన్నారు విద్యార్థులు కూడా సమయానికి తగు బస్సులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే సంబంధిత పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆర్టీసీ డిపో ను గాడిలో పెట్టాలన్నారు. లేని పక్షంలో జనసేన పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.