5వ రోజుకు చేరుకున్న పాటంశెట్టి ఆమరణ నిరాహార దీక్ష

జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ దేవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో 5వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం కూడా స్థానిక పిహెచ్ సి వైద్య బృందం వచ్చి సూర్యచంద్ర, శ్రీ దేవిలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో సూర్యచంద్ర ఆరోగ్య పరిస్థితి గంట గంటకు క్షీణిస్తుందని.. వీలైనంత తొందరగా ఉన్నతాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించి ఆయనను హాస్పిటల్ కు తరలించాలని లేదంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మన చేయి దాటిపోతుందని అధికారులకు నివేదిక పంపించామని చెప్పారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నానికి ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ జిల్లా ఏ. పి.డి వచ్చి గతంలో వచ్చిన అధికారులు చెప్పిన విధంగానే మీరు చెప్పిన విషయాలు అన్ని పరిగణలోనికి తీసుకున్నామని.. వెంటనే మా పై అధికారులకు ప్రాథమిక నివేదిక పంపిస్తామని చెప్పారు.. తప్ప నష్టపోతున్న వెంగయ్యమ్మపురం ఉపాధి హామీ కూలీలకు న్యాయం జరిగే విధంగా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. చెప్పకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా అక్కడకు వచ్చిన అధికారులతో సూర్యచంద్ర మాట్లాడుతూ.. రామయ్యమ్మ అనే ఒక మహిళ చనిపోయి ఒక సంవత్సరం అవుతున్నా ఆమె పేరుపై మస్తర్ ఎలా పడుతుంది. ఆమె అకౌంట్ లోకి ఎలా డబ్బు వస్తుందని ప్రశ్నించారు. తరువాత అక్కడ ఉన్న గ్రామ ప్రజలు, జన సైనికులు మాట్లాడుతూ.. మాకు న్యాయం జరగడం కోసం మా అందరికీ బదులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారని.. ఈ క్రమంలో అధికారులు తక్షణమే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్లి విచారణ జరిపించాలని.. ఒకవేళ విచారణ జరిపించడంలో ఏమైనా జాప్యం జరిగి సూర్యచంద్ర గారికి గాని అనుకోనిది ఏమైనా జరిగితే తర్వాత జరగబోయే పరిణామాలు మీ ఊహకు కూడా అందవని హెచ్చరించడం జరిగింది.