తెలంగాణలో ఉమ్మడి పోటీపై పవన్ కళ్యాణ్ తో బి.జె.పి. నేతల చర్చలు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బి.జె.పి. తెలంగాణ శాఖ అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ గారు చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్.డి.ఎ.లో జనసేన కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సావధానంగా చర్చలు చేశారు. జనసేన నాయకుల మనోగతాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు బి.జె.పి. నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బి.జె.పి. అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బి.జె.పి. అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బి.జె.పి. అభ్యర్థుల విజయానికి కృషి చేశామని, ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని శ్రీ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా తెలియచేశారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన కార్యాలయానికి విచ్చేసిన బీజేపీ నేతలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానించారు.