మిస్సైల్ మాన్ కు అంజలి ఘటిoచిన పవన్ కళ్యాణ్

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం.. ఆయనో మాస్ లీడర్ కాదు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ప్రజలు ఎన్నుకోలేదు. అనుకోకుండా రాష్ట్రపతి అయ్యారు. కానీ అందరి రాష్ట్రపతుల్లా మిగిలిపోలేదు. ఏ రాజకీయనాయకుడు అందుకోని ఖ్యాతిని గడించారు. దేశం నలుమూలల్లో ఉన్న చిన్న పాఠశాలలో సైతం ఆయన జయంతిని వర్ధంతిని నిర్వహిస్తున్నారంటే ఆయన ఖ్యాతి ఎలా నలుదిశలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు.  ఈ రోజు ఆయన జయంతి  సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భక్తితో అంజలి ఘటిస్తూ.. కలాం గారు ప్రాతఃకాల స్మరణీయుడు… గొప్ప మార్గదర్శి అని కొనియాడారు. ఏ కోణంలో చూసినా ఈ తరంలో ఆయన ఒక అద్భుతం అని ఆయన కీర్తించారు. ఆయన జీవితం ఆసాంతం మనకు ఒక పాఠమే. దేశం కోసమే పుట్టి దేశం కోసమే జీవించిన ధీరోదాత్తుడు అని పవన్ ప్రశంసించారు. రాకెట్ శాస్త్రాన్ని అవపోసనపట్టి దేశ ఆయుధ తూణీరానికి ఎన్నో క్షిపణులను,అణ్వాయుధాలను అందించిన దేశ భక్తుడు అని అన్నారు.

శత్రువు మన దేశం వైపు కన్నెత్తి చూడడానికి భయపడేలా దేశ రక్షణ వ్యవస్థకు రూపకల్పన చేసిన దార్శనికుడు అని కొనియాడారు. ‘ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ వ్యక్తిగా అవతరించారు. రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా ఒదిగి ఒదిగి జీవించడం ఎందరికి సాధ్యం. ఒక్క కలాం గారికి తప్ప! మిస్సైల్ మాన్ అని కీర్తించినా.. భారత రత్నతో గౌరవించినా వినమ్రునిగానే భాసిల్లారు. కలాం చూపిన మార్గంలోనే నా రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది. దేశానికి ఇవ్వడమే తప్ప దేశం నుంచి ఏమి తీసు కోని ఆయన ఔన్నత్యమే నాకు శిరోధార్యం. ఈ రోజు ఆ మహానుభావుని జయంతి. ఈ పర్వదినాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన ఆయనకు భక్తితో అంజలి ఘటిస్తున్నాను అని అన్నారు.