మీ కేశ సంపదను ప్రజలే ఖాళీ చేస్తారు జాగ్రత్త!

•రాష్ట్రంలో త్వరలో శ్రీలంక పరిస్థితి ఉత్పన్నం
•రాష్ట్రంలో సమస్యలు లేకుంటే రెండో విడతలోనూ ఇన్ని సమస్యలు ఎలా వస్తాయి?
• వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం
•కోనసీమలో శాంతి కోసం మొదట మాట్లాడింది మేమే
•మంత్రి శ్రీ విశ్వరూప్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కనీసం పరామర్శించారా?
•ఆయన ఇంటిపై దాడిని ఖండించలేదు
•ఆంధ్రుల కుల భావన కొత్త పుంతలు తొక్కుతోంది
•కలిసి పోరాడకపోతే ఈ దాష్టికాలకు అంతు ఉండదు
•విజయవాడలో రెండో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ముగింపు
•ముగింపు సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘కేశ సంపద చాలా విలువైంది. దాన్ని ప్రతిసారి పీక్కోకండి. రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల సమస్యల గురించి ప్రజా వేదికల్లో మాట్లాడాల్సిందిపోయి, ప్రతిసారి మీరు మీ కేశాలకు పని చెబితే ప్రజలే త్వరలో అవి పూర్తి స్థాయిలో పీకే పనిలో ఉంటార’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ప్రముఖ హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ చెప్పిన ‘సింహాసనం ఖాళీ చేయండి.. ప్రజలు వస్తున్నారు’ అనే మాటలను లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ ఎమర్జెన్సీ కాలంలో పాట్నాలో ఉటంకించారు.. వాటిని ఇప్పుడు ఓసారి మనం గుర్తు చేసుకోవాల’న్నారు. త్వరలోనే మన రాష్ట్రంలో ఆ పరిస్థితులు రాబోతున్నాయని, వైసీపీ నాయకుల దాష్టికాలు, దౌర్జన్యాలు చూసి ప్రజలే వారిని సింహాసనం దించే సమయం దగ్గరవుతోందని చెప్పారు. విజయవాడలోని శ్రీ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి – జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా విలేకరులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శ్రీ మాకినేని బసవపున్నయ్య గారి పేరు మీద ఉన్న భవనంలో కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు గొప్పవి. పేదల పక్షపాతి. మాకినేని బసవపున్నయ్య వంటి వారు ఆస్తులు అమ్మి ప్రజలకు సేవ చేశారు. ఇప్పటి‌ వైసిపి నేతల్లా వారు దోచుకోలేదు.. దాచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి- గొంతెత్తితే కేసు… ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్.. పోరాడితే దాడులు అన్నట్లు తయారయింది. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతిపక్ష పార్టీ వాళ్లే కాదు.. సొంత పార్టీ వాళ్ళను సైతం వైసీపీ నేతలు వదలడం లేదు. బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన విలువలు నేర్పిస్తాం.
•మీ పాలన అంత బాగుంటే ఇన్ని అర్జీలు ఎందుకొచ్చినట్లు?
గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్ ను కచ్చితంగా రక్షించేందుకు బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో హింస చాలా కామన్ అయిపోయింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు ప్రతి చోట్ల వైసీపీ నాయకులు ప్రజలపై గూండాయిజం చేస్తున్నారు. సమాజంలో అరాచకాలు చేసేవారు 25 మంది ఉంటే వారిని చూసి భయపడేవారు వేలల్లో ఉంటారు. అలా భయపడే వారిలో ధైర్యం నింపడానికి నేను ముందుకు వచ్చాను. ఈ ప్రయాణంలో నేను పూర్తిగా దహించుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరి గుండెల్లో బలమైన ధైర్యం మాత్రం నింపుతాను. ఇప్పుడు నా వద్దకు వచ్చిన సమస్యలన్నీ ప్రభుత్వం నెరవేర్చాల్సినవే. వారు దానికి చొరవ తీసుకోకపోవడంతోనే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడకు వచ్చారు. మీ ప్రభుత్వం అంత బాగుంటే వరుసగా రెండో ఆదివారం కూడా 400 పైగా పిటిషన్లు మా వద్దకు ఎందుకు వస్తాయి?
•వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వాళ్ళు మాఫియాలా మార్చే ప్రమాదం
వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను వైసీపీకి వంతపడే ఒక మాఫియా వ్యవస్థ తరహాలో తయారు చేయాలని చూస్తున్నారు. ఆ ప్రమాదం పొంచి ఉంది. పంచాయితీలకు నిధులు రాకుండా చేసి గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆశయాన్ని పూర్తిగా చంపేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అభివృద్ధి మీద ప్రశ్నించినా, సమాచార హక్కు చట్టం ఉపయోగించినా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎందుకు మీకీ అభద్రత భావన.. ఎందుకు మీకు ఈ అహంకారం.? దివ్యాంగుడు అయిన మణికంఠ అనే యువకుడు కేవలం నా ఫోటోను సోషల్ మీడియాలో పెట్టుకుంటే పింఛను ఆపేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.
•మమ్మల్ని కౌరవులతో పోల్చడం ఎందుకు?
మాకు అధికారం లేదు. మాకు లక్ష కోట్ల సంపద లేదు. కోకొల్లలుగా కేసులు లేవు. సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. ఒక్కసారి కూడా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టలేదు. మరి ఎందుకు మీరు మమ్మల్ని కౌరవులతో పోలుస్తారు.? కౌరవులే అధికారంలో ఉండి అధికారంలో లేని పాండవులతో పోరాడారు. దౌర్జన్యాలు దోపిడీలు చేసేది మీరు. ప్రజల్ని వేధించేది, హింసించేది మీరు. కౌరవుల లక్షణాలు ఉన్న మీరు మమ్మల్ని అనడం ఏమిటి? జనసేన పార్టీని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని బింకాలు పలకొద్దు. వైసీపేవాళ్లు ఏమైనా దిగివచ్చారా? ఇది మారిన కాలం. జనసేన కోసం ఎదురు చూస్తున్న కాలం. మీరు ఎవరూ మమ్మల్ని ఆపలేరు.
•దివ్యాంగులు పెన్షన్ అడిగితే హేళన చేస్తారా?
దివ్యాంగులు పింఛను అడిగితే వారిని అవహేళన చేస్తున్నారు. కావాలని నాటకాలు ఆడుతున్నారంటూ వాలంటీర్లు అవమానిస్తున్నారు. కార్మికులకు బీమా అందడం లేదని ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ బీమా సంస్థకు ప్రత్యక్షంగా ప్రీమియం కట్టాల్సింది పోయి మధ్యలో ఒక ప్రైవేటు దళారీ సంస్థను ఏర్పాటు చేసి, ఆ సొమ్మును ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. 2015-19 కాలంలో 25 లక్షల లబ్ధిదారులకు రూ.3 వేల కోట్లు బీమా పరిహారం అందింది. 2019-22 సంవత్సరాల కాలంలో కేవలం రూ.65 కోట్లు మాత్రమే అందినట్లు తెలుస్తోంది. ఎందుకో కావాలని పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. లబ్ధిదారులకు కుటుంబ యజమాని చనిపోతే కనీస సాంత్వన కలిగించడం లేదు. ఒక రాజకీయ పార్టీగా మేమే కార్యకర్తలకు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా చేయిస్తే ప్రభుత్వం ఎందుకు ప్రజలను ఆదుకోలేకపోతోంది?
•అన్ని శాఖల మంత్రి శ్రీ సజ్జల మాట్లాడాలి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి పరిస్థితి అలాగే ఉంది. సంక్షేమ నిధిలో రూ. 918 కోట్లు ఉంటే, దానిని వారికి ఖర్చు పెట్టడంలో మాత్రం ప్రభుత్వానికి మనసు రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక రూ.6 వేలు ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చాక అది 6 రెట్లు పెరిగింది. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోయింది. మూడేళ్లుగా ప్రభుత్వం తరఫున మేడే నిర్వహించడం లేదు. కార్మిక శాఖ మంత్రి ఏ విషయం మాట్లాడరు. అన్ని శాఖలకు ఒకరే మంత్రి సజ్జల గారే. ఆయన దీనిని అసలు పట్టించుకోరు. ఎయిడెడ్ పాఠశాలలకు సహాయం చేయాల్సింది పోయి, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తో ఏపీ ముఖ్యమంత్రికి మంచి స్నేహం ఉంది. అలయి బలయి చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో ఉత్తరాంధ్రకు చెందిన 16 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడే ధైర్యం కూడా లేదు. అలాగే ఏపీలో బేడ బుడగ జంగాల కులం గుర్తింపు రద్దు చేశారు. కాలుష్యం మీద, నిర్వాసితుల సమస్యల మీద, గర్భిణీ స్త్రీలు అంగన్వాడికి వచ్చి భోజనాలు చేయడం పైనా, చేనేత కార్మికులకు కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చాయని సంక్షేమం తొలగించడం పైన అనేక ఫిర్యాదులు వచ్చాయి. టిడ్కో ఇళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఫీజు రియింబర్స్మెంట్, రోడ్ల సమస్య, స్మశానాల ఆక్రమణలు, తాగునీటి సౌకర్యం, ఇళ్లు ఇలా అన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని ఆయా శాఖలకు వెంటనే పంపించి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం.
•శ్రీ వంగవీటి రంగా పేదల మనిషి
పేదల గుండెల్లో కలకాలం నిలిచిపోవాలంటే ఒక కులం నుంచో మతం నుంచో రావాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా వారికి సహాయం చేయాలి. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఇప్పటికీ మారు మోగుతోంది అంటే ఆయన పేదలకు చేసిన సహాయం గొప్పది. ప్రతిక్షణం పేదల కోసం ఆయన తపించిన తీరు వారి గుండెల్లో ఉండిపోయింది. అందుకే ఆయన కులాన్నీ,మతాన్నీ దాటి సహాయపడడం అందరికీ గుర్తుండిపోయింది.
•బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును గౌరవంగా స్వాగతిస్తాం
కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టడాన్ని జనసేన పార్టీ గౌరవపూర్వకంగా, మనస్పూర్తిగా స్వాగతిస్తోంది. దీనిని మేము మొదటే ప్రకటించాం. కావాలని గొడవలు సృష్టించి, అశాంతి నెలకొల్పి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ భావించింది. దానిని ఇతరుల మీద నెట్టాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఆయన క్యాబినెట్లో ఉన్న ఎస్సీ మంత్రి శ్రీ పినిపే విశ్వరూప్ గారి ఇల్లు దహనమైతే కనీసం ఈ ముఖ్యమంత్రి ఖండన ప్రకటన చేయలేదు. వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు. ఇలాంటి వారా దళితుల సంక్షేమం గురించి మాట్లాడేది? అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని తీసేశారు. ఈ రోజు ఓ ఎస్సీ యువకుడు తనకు లండన్ యూనివర్సిటీలో సీటు వచ్చిందని అయితే అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పథకం లేకపోవడంతో తనకు సాయం అందడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను నిలిపివేశారు. వారికి రూ.15 వేలు డబ్బులు ఇవ్వడం కాదు.. వారు పదిమందికి రూ. 15 వేలు వేతనం ఇచ్చే స్థాయికి తీసుకురావాలి. జాతి నాయకులైన శ్రీ పొట్టి శ్రీరాములు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి వారిని ఒక కులానికి ఆపాదించలేం. వారు జాతి ముద్దుబిడ్డలు. ఏ పథకానికైనా, ఏ ప్రాంతానికి అయినా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెడితే మొదట ఆనందించే వ్యక్తిని నేనే. అలాగే మాదిగ సోదరులకు అండగా ఉండే లిడ్కాప్ ను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వారికి లిడ్ క్యాప్ ద్వారా ఎలాంటి ప్రోత్సాహం అందకుండా చేస్తోంది. ఇది ఈ ప్రభుత్వ తీరుకు నిదర్శనం.
•కుల భావన తప్ప ఏమీ లేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో దశాబ్దంన్నర పాటు ఆంధ్రులను దోపిడీదారులు అంటూ రకరకాలుగా తిట్టారు. వారికి బలమైన ప్రాంతీయ భావన అక్కడ బాగా పనిచేసింది. ఆంధ్రాలో అసలు మేం ఆంధ్రులం అన్న భావన లేదు. ఇక్కడ కుల భావన తప్ప, ఆంధ్ర భావన పూర్తిగా లేదు. పోనీ కుల భావన అయినా పూర్తిస్థాయిలో పాటిస్తున్నారా అంటే అదీ లేదు. సొంత కులంలోని వారిని తిట్టుకుంటూ, తమ ప్రభువుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. అదే గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఏ కులం నాయకులను వారితో తిట్టించడం గొప్ప విషయంగా మారిపోయింది. వైసీపీ నాయకుల దాష్టికాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ స్థిరత్వం ఉంటే పాలనాస్థిరత్వం వస్తుంది. పాలన స్థిరత్వం ఒక్కసారి వస్తే ప్రజలే ప్రభువులుగా మారుతారు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. వారు చెప్పిందే వేదం కావాలి. తిరగబడే మైండ్ సెట్ లేకపోతే ఈ దోపిడీ దౌర్జన్యకాండ ఇలాగే సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడే తెగిస్తే సరిపోదు. ప్రతి విషయానికి ప్రతి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రాలేడు. మీలో నాయకులు, నాయకురాళ్లు పుట్టాలి. కామన్ మినిమం ప్రోగ్రాం కింద ప్రభుత్వ పాలనను ఎలా ఎదిరించాలి అనే బాధ్యతను అంతా తీసుకోండి. ఎలాగైనా ఆంధ్రప్రదేని పూర్తిస్థాయిలో అభివృద్ధిలో నిలపాలి అన్నదే నా అంతిమ లక్ష్యం. పోరాటంలో కాస్త పోగొట్టుకునే విషయంలోనూ మానసికంగా సిద్ధం అవ్వండి. నేను కూడా నా సినిమాలతోనే బతుకుతున్నాను. నాకు బోలెడు వేధింపులు, వ్యక్తిగత నష్టాలు జరిగాయి. వాటిని తట్టుకునే శక్తి సంతరించుకొని పోరాడండి. మగ, ఆడ అనే తేడా లేదు. ఒక కొత్త మార్పు కోసం, మన జీవితాలను ఏడిపిస్తున్న ఈ పాలకులను తరిమికొట్టేందుకు కట్టుగా పోరాడుదాం” అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.
•వైసీపీ నాయకుల అరాచకాలపై అర్జీలు వస్తున్నాయి: శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “రెండో విడత జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మొదటి విడతలో బాధితుల నుంచి 427 అర్జీలు స్వీకరిస్తే… రెండో విడతలో 539 అర్జీలు వచ్చాయి. వీటిని మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయం నుంచి స్వీకరించారు. రోడ్లు, భవనాల శాఖ కు సంభందించి 52, గృహ నిర్మాణ శాఖ కు సంభందించి 41, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ కు సంభందించి 40, ఆరోగ్య శాఖ కు సంభందించి 40, రెవెన్యూ శాఖ కు సంభందించి 32, విద్యాశాఖ కు సంభందించి 26 అర్జీలు వచ్చాయి. స్వీకరించిన అర్జీల పరిష్కార ప్రక్రియ రేపటి నుంచి పార్టీ కార్యాలయంలో మొదలవుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల అరాచకాలు, సామాన్యులను పెడుతున్న ఇబ్బందులపై చాలా మంది పిటీషన్లు ఇచ్చార”న్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జనసేన నేత శ్రీ డి.వరప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.