వికలాంగులకు చేయూత నిద్దాం: గుడ్లూరు జనసేన

  • ప్రపంచ వికలాంగుల దినోత్సవం
  • వికలాంగులకు చేయూత నిద్దాం, వారిలో అద్భుతమైన ప్రజ్ఞాపాటవాలను ప్రపంచానికి నిరూపిద్దాం

గుడ్లూరు: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గుడ్లూరు మండల జనసేన ఆద్వర్యంలో వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంగవైకల్యం శాపం కాదు, వారికి ఆదరణ, సహకారం ఇవ్వాల్సింది పోనిచ్చి అన్ని అవకాశాలు ఉండి కూడా వారి పట్ల విజ్ఞత చూపలేక పోవడం అసలైన వైకల్యం, మానవలోపం అని గుడ్లూరు మండల జనసేన అభిప్రాయ పడుతున్నది. వికలాంగులకు సహాయసహకారాలు అందించి, వారిని ఆదరించి, వారిని గౌరవించి సాధారణ జనజీవనం లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి వికలాంగుల దినోత్సవంగా 1992 డిసెంబర్ 3న, 1998 నుంచి అన్ని దేశాలు కూడా ఏదో ఒక అంగవైకల్యం సంబంధించిన అంశాన్ని తీసుకొని వికలాంగుల దినోత్సవం పాటించడం జరుగుతుంది. వికలాంగుల పునరావాస నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ, 1983 లో వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరిగింది. వారికి ప్రభుత్వ పధకాలు అమలు పరిచేందుకు సహాయ సంచాలకుల కార్యాలయాలు పనిచేస్తున్నాయి. శారీరక, మానసిక వైకల్యం ఉండటం ‌భగవంతుని శాపం కాదు, మానవ తప్పిదం అంతకన్నా కాదు. ఎందరో మహానుభావులు పుట్టుకతో గానీ, జబ్బున పడటం వల్ల గానీ, ప్రమాదవశాత్తు గానీ వైకల్యం చెందిన వారు తమ స్థైర్యాన్ని కోల్పోకుండా, కవులు గానూ, సంగీత కళాకారులు గానూ, క్రీడాకారులు గానూ ఇంకా అనేకమైనటువంటి రంగాల్లో తమ ప్రజ్ఞాపాటవాలు చూపించారు. ప్రఖ్యాత బ్రిటిష్ కవి జాన్ మిల్టన్ తన 44వ ఏట తన కంటిచూపు పోయాక ప్యారడైజ్ లాస్ట్ అనే అద్భుత కావ్యం రాశారు. జర్మనీ కి చెందిన ప్రపంచ ప్రసిద్ధ సంగీత కారుడు భీదోవెన్, ఈయనకు బ్రహ్మ చెముడు. ప్రాచీన గ్రీకు మహాకవి హోమర్, ఈయన అంధుడు. అమెరికా కి చెందిన హెలెన్ టెల్లర్ 19 నెలల వయసు లోనే జబ్బు చేయడంతో చెముడు, మూగతనం, గుడ్డితనం వచ్చాయి. ఈ కారణంగా స్నేహితులు లేకపోవడం వల్ల తను ఒంటరి అని ఫీల్ అవ్వకుండా మానసిక స్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎన్నో గ్రంథాలు రాశారు, అనేక ట్రస్ట్ ల ద్వారా వికలాంగులకు సేవలందించారు. మనదేశంలో కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన గిల్ బిలే అనే వ్యక్తి చేతులు లేకుండా సైకిల్ ఎక్కి తనంతట తాను తొక్కగలడు, నీటిలో ఈదగలడు. ఇలాంటి మరెందరో స్పూర్తి ప్రదాతలు తమ వైకల్యాన్ని అధిగమిస్తున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేనిది ఏమీలేదు. లక్ష్యాన్ని మరువక పోవడమే విజయానికి కీలకం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గుడ్లూరు మండల జనసైనికులు మూలగిరి శ్రీనివాస్, అనిమిశెట్టి మాధవ రావు, అన్నంగి చలపతి, ఆలా శివ, కంఠా హజరత్తయ్య, రాజేష్, అమోస్, సాయి, రాంబాబు తదితరులు వికలాంగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికలాంగులకు చేయూత నిద్దాం, వారిని గౌరవిద్దాం, అభిమానిద్దాం, సాయం అందిద్దాం, ఆదరిద్దాం, వారిలో అద్భుతమైన ప్రజ్ఞాపాటవాలను ప్రపంచానికి నిరూపిద్దామని జనసేన తరపున తెలియజేసారు.