వైసీపీ నిరంకుశ పాలనపై ప్రజాయుద్ధం మొదలైంది: నేరేళ్ళ సురేష్

గుంటూరు, వైసీపీ నిరంకుశ పాలనపై ప్రజాయుద్ధం మొదలైందని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 7 వ డివిజన్ అధ్యక్షుడు షేక్ రజాక్ ఆధ్వర్యంలో బస్టాండ్, మాయాబజార్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ముస్లిం యువకులు నెరేళ్ల సురేష్ కు ఘనస్వాగతం పలికారు. నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ప్రజాకంఠక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించాల్సిన బాధ్యత యువకులపై ఉందన్నారు. గత ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ రెడ్డి నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రంజాన్ తోఫా, షాదీ తోఫా వంటి వాటిని వైసీపీ అధికారంలోకి రాగానే ఆపేయటం ముస్లిం సమాజాన్ని మోసం చేయటమేనని మండిపడ్డారు. ముస్లిం యువత ఉపాధికోసం ఇస్లాం బ్యాంక్ పెడతానని చెప్పిన జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఆ ఊసే ఎత్తలేదని ధ్వజమెత్తారు. ముస్లిం పేద విద్యార్థులకు విదేశీ విద్యలోనూ తీరని అన్యాయం చేశారని విమర్శించారు. మరోవైపు వైసీపీ దుర్మార్గాలను , అరాచకాలను ప్రశ్నిస్తే చాలు ఎంతటివారిపైనైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దాష్టీకాలను కలిసికట్టుగా ఎదురుకుందామని నెరేళ్ల సురేష్ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, జనసైనికులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.