గుంటూరు మేయర్ పై పోలీసులు సుమోటోగా కేసు దాఖలు చేయాలి

• లేదంటే గుంటూరు పోలీసులు సుప్రీం కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్లే
• 24 గంటల్లో కేసు దాఖలు చేయకపోతే కోర్టు ధిక్కరణ పిటీషన్ వేస్తాం
• అధికార అహంకారంతో అలజడులు సృష్టిస్తున్న వైసీపీ నాయకులు
• చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింప చేయాలి
• తప్పు చేసినవారికే వత్తాసుగా నిలుస్తున్నారు
• గుంటూరు మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్

‘నాయకుడు తప్పులు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా చేయాలి అనే భావన వైసీపీ నాయకులది. అధికార అహంకారంతో వారు చేస్తున్న వ్యాఖ్యలు, చేష్టలు కచ్చితంగా నేరం చేసినట్లే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై హేట్ ఆఫ్ స్పీచ్ కింద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గౌరవ మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి- జనసేన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వెంటనే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలి. లేకుంటే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామ’ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. గుంటూరు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “దేశంలో చట్టం అందరికీ సమానమే. ఎవరు తప్పు చేసినా ఒక్కటే. అధికారంలో ఉన్నవారికి ఒకలా, లేనివారికి మరోలా చట్టం పని చేయకూడదు. చట్టాన్ని కాపాడే పోలీసులు కచ్చితంగా ఈ విషయంలో తారతమ్యాలు చూపకూడదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ కి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న జనసేన నాయకులను పోలీసులు నిన్న అర్థరాత్రి నుంచి అడ్డుకున్నారు.
• జిల్లావ్యాప్తంగా 350 మంది జనసేన నాయకులను అరెస్టు చేశారు
జనసేన పార్టీ ఎప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే నిరసన తెలుపుతుంది. రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవించే పార్టీ జనసేన. అది మా పార్టీ అధ్యక్షుల వారు పార్టీ నాయకులకు శ్రేణులకు నేర్పించిన సంస్కారం. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లే హక్కు కూడా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఇంకెందుకు..? పోలీసులు తప్పుగా మాట్లాడిన వ్యక్తికి అండగా నిలిచి మా జనసేన నాయకులను, శ్రేణులను నిన్న అర్థరాత్రి నుంచి అరెస్టు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 350 మందిని అరెస్టు చేశారు. మేయర్ చేసిన వ్యాఖ్యలను అతని ఇంట్లోని వారు కూడా హర్షించరు. వైసీపీ నాయకుడి మన్ననలు పొందడానికి కింది స్థాయి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీ పవన్ కల్యాణ్ గారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అశాంతి రేపిన గుంటూరు నగర మేయర్ పై గుంటూరు అర్బన్ పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేయాలి. ద్వేషపూరితమైన ప్రసంగాలు, వ్యాఖలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా ఉంది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశం కూడా పోలీసులకు ఉంది. ఈ అంశాన్ని గుంటూరు అర్బన్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరిగా స్పందించలేదు. జనసేనపై కేసులు పెడతామని అంటున్నారు.
• సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది
28-04-2023న గౌరవ జస్టిస్ జోసెఫ్, గౌరవ జస్టిస్ నాగరత్న ఓ కేసు విషయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సమాజంలో అలజడి రేపే వ్యాఖ్యలు, అశాంతికి కారణమయ్యే మాటలు ఎవరు మాట్లాడినా కచ్చితంగా పోలీసులు సుమోటోగా కేసుగా నమోదు చేయాలి అని చెప్పారు. గుంటూరు మేయర్ చేసిన వ్యాఖ్యలు సైతం అశాంతిని రేపేలా రెచ్చగొట్టేలా ఉన్నాయి. దీనిని గుంటూరు ఎస్పీ పరిశీలించాలి. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలి. అలా కాకుంటే గౌరవ సుప్రీంకోర్టు ధిక్కరణ కింద ఈ విషయంలో జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. గుంటూరు పోలీసులు సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 24 గంటల్లో గుంటూరు నగర మేయర్ పై కేసు దాఖలు చేయని పక్షంలో పోలీసు ఉన్నతాధికారులపై సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన పిటీషన్ దాఖలు చేస్తాం. సెక్షన్ 153A, 153B, 295A, ఐపీసీ 505 ప్రకారం కచ్చితంగా కేసులు నమోదు చేయాలి.
• మరో అయిదు నెలల్లో ప్రభుత్వం మారుతుంది
ప్రజాస్వామ్య రీతిలో నిరసన తెలపాలి అనుకున్న మా పార్టీ నేతలపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేశారు. హౌస్ అరెస్టులు చేశారు. ఇదేమిటని జిల్లా ఉన్నతాధికారులను అడిగితే గుంటూరు మేయర్ కు వత్తాసు పలుకుతూ అండగా నిలబడి మాట్లాడుతున్నారు. మాపైన కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇదేం తీరు..? రూల్ ఆఫ్ లా అనేది పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మరో ఐదు నెలల్లో ఈ ప్రభుత్వం మారబోతోంది. అధికారులు చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింప చేయాలి. తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. అంతే తప్ప విపక్షాలపై ఒకలా, అధికార పార్టీకి మరోలా చూపి వివక్ష చూపకండి. జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ఎప్పుడు పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బలంగా నిలబడతారు.
• వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ, అవినీతిపై ఈడీకి ఫిర్యాదు
తమిళనాడులో ఇసుక దోపిడీ చేస్తున్నవారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి కేసులు నమోదు చేస్తోంది. ఇక్కడ కూడా వైసీపీ నాయకులు ఏ విధంగా ఇసుక దోపిడీ చేస్తున్నారో చూస్తున్నాం. ఒక సంస్థకే ఇసుక కట్టబెట్టి ఆ పేరుతో దోచేస్తున్నారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ, అవినీతిపై ఢిల్లీ వెళ్ళి ఈడీకి ఫిర్యాదు చేస్తాం” అన్నారు.
• లాడ్జి సెంటర్ లో జనసేన శ్రేణుల ధర్నా
అంతకు ముందు పోలీసు ఆంక్షల నడుమ శ్రీ మనోహర్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి భారీ ర్యాలీగా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కాజా టోల్ గేట్, ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా లాడ్జి సెంటర్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మీడియా సమావేశం అనంతరం లాడ్జి సెంటర్ కూడలి వద్ద మేయర్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాకు దిగారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, సయ్యద్ జిలాని, నయూబ్ కమాల్, విజయ్ శేఖర్, పార్టీ నాయకులు ఆమంచి సోములు, బండారు రవికాంత్, శ్రీమతి కన్నా రజని, శ్రీమతి బోని పార్వతినాయుడు తదితరులు పాల్గొన్నారు.