పూర్ణపాడు – లాభేసు వంతెన పాపం పాలకులదే..!

  • తరాలుగా గిరిజనులను ఊరిస్తున్న పూర్ణపాడు లాభేసు వంతెన
  • ఎన్నికల హామీగా వాడుకుంటున్న పాలకులు
  • మాజీ, తాజా ఉపముఖ్యమంత్రులు న్నా గిరిజనులకు తప్పని ఇబ్బందులు
  • గిరిజనులకు తప్పని డోలీలా మోతలు, నదులపై ఈతలు
  • తక్షణమే మరబోట్లను ఏర్పాటు చేయాలి
  • జిల్లా ఆస్పత్రిలో ఉన్న రెబ్బ గిరిజన పిల్లలను పరామర్శించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: మన్యం జిల్లా, కొమరాడ మండలం, పూర్ణపాడు లాభేసు వంతెన పాపం పాలకులదేనని జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెబ్బ గ్రామానికి చెందిన పిల్లలు కోలక మరియమ్మ, కొండగొర్రె రాహుల్ లను జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు పరామర్శించారు. జరిగిన సంఘటన విషయం వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి గూర్చి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరియమ్మకు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు అవసరాన్ని బట్టి తమకు సమాచారం ఇస్తే జనసైనికులు రక్తదానం చేసేందుకు సిద్ధం అన్నారు. గిరిజన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నదిపై వెదురు బొంగులతో చిన్నపాటి తెప్ప తయారుచేసి దానిపై పిల్లలను వైద్యము నిమిత్తం ప్రాణాలకు తెగించి బాహ్య ప్రపంచానికి తీసుకురావడం అనే దృశ్యం మానవ హృదయాలను కలిసివేసిందన్నారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్న పాలకుల్లో స్పందన లేకపోవడం అన్యాయమన్నారు. పార్వతిపురం మన్యం జిల్లాలో మాజీ, తాజా ఉపముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. డోలీలా మోతలు నాగావళి నది ఈతలు తప్పడం లేదన్నారు. తరాలుగా పూర్ణపాడు లాభేసు వంతెన కోసం గిరిజనులు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ వంతెన నిర్మాణం కోసం వందలు వేల కోట్లు అవసరం లేదని, కేవలం 10 కోట్ల రూపాయల మాత్రమే అవసరం అన్నారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే 10 కోట్లు ఏమాత్రం అని ప్రశ్నించారు. దాదాపు తొమ్మిది పంచాయతీలు 22 గ్రామాలు 12 జనాభాకు ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణం పై కనీసం శ్రద్ధ చూపకపోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు. 1996లో రెబ్బ -వనధార సమీపంలో నాటు పడవ మునిగి సుమారు 32 మంది మృత్యువాత పడ్డారన్నారు, అంతే కాకుండా వర్షాకాలంలో నాగావళి నదిలో పలువురు గిరిజనులు గల్లంతయ్యే పరిస్థితులు చోటు చేసుకుంటున్నయన్నారు. వర్షాకాలం ఆరంభం నుండి ముగింపు వరకు నాగావళి ఆవలున్న గ్రామాల ప్రజలు అత్యవసరాలతో పాటు నిత్యవసరాలు అందక ఇబ్బందులు పడుతుంటారన్నారు. గర్భిణీ స్త్రీలు మొదలుకొని వృద్ధులు, పిల్లలు రోగాలు బారిన పడి పలువురు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయన్నారు. నాగావళి వర్షాకాలం అంతా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వారు బాహ్య ప్రపంచానికి రాకపోకలు సాగించలేని దుస్థితి అన్నారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన వంతెన నిర్మాణానికి కనీసం పాలకులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో పూర్ణపాడు – లాబేసు వంతెనను ఎన్నికల హామీగా పాలకులు వాడుకుంటున్నారన్నారు. దశాబ్దాల తరబడి ఈ వంతెన ఇక్కడ గిరిజనులను ఊరిస్తోందన్నారు. నాగావళి నది ప్రవాహంతో ఇబ్బందులు పడిన ప్రతి గిరిజన కుటుంబం ఆవేదన, మృత్యువాత పడిన బాధిత కుటుంబాల ఆక్రందనల పాపం పాలకులదే అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కురుపాం వచ్చేటప్పుడు కూడా కనీసం పూర్ణపాడు, లాబేసు వంతెన సమస్య ప్రస్తావనకు రాకపోవడం విడ్డూరం అన్నారు. వర్షాకాలంలో నాగావళి ఆవలున్న ప్రజలకు కనీసం వైద్య సదుపాయాలు కూడా అందే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా సంబంధిత పాలకులు, అధికారులు ఆలోచించి పూర్ణపాడు లాభేసు వంతెన ప్రాధాన్యతను గుర్తించి కళ్ళు తెరచి కొంచెం నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే వర్షాకాలంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, దీనికి తగు చర్యలు చేపట్టాలని కోరారు. వంతెన నిర్మాణం జరిగేంతవరకు మర బోట్లను ఏర్పాటు చేయాలన్నారు.