మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధానిమోదీ.. ట్విట్ట‌ర్‌లో ప్ర‌భావ‌శీల ప్రముఖుల జాబితాలో రెండో స్థానం

భారత ప్రధాని మోదీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్‌లో 2021 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని వినియోగదారుల నిఘా కంపెనీ ‘బ్రాండ్ వాచ్’ తమ వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. మొత్తం 50 మంది వ్యక్తులతో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో సింగర్ కేటీ పెర్రీ, నాలుగో స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఐదో స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఉన్నారు.

అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 35వ స్థానంలో నిలిచాడు. దశాబ్ద కాలంగా సచిన్ యూనిసెఫ్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 2013లో యూనిసెఫ్ దక్షిణాసియా రాయబారిగా నియమితులయ్యాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ సేవలను బ్రాండ్ వాచ్ కొనియాడింది. సచిన్ నుంచి స్ఫూర్తి పొంది ఆయన అభిమానులు కూడా ఆ సేవలను కొనసాగిస్తున్నారని ప్రశంసలు కురిపించింది. కాగా దేశ ప్రధాని మోదీపై విమర్శలు వచ్చిన ప్రతీసారి ఆయన రీబౌన్స్ అవుతూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.