మొక్కుబడిగా రోడ్డు నిర్మాణం పనులు, గడువు ముగిసినా కదలని పనులు ఎమ్మెల్యే గారూ పట్టించుకోండి..!! త్యాడ రామకృష్ణారావు(బాలు)

*నత్తనడకన రోడ్డు నిర్మాణం పనులు
*గడువు ముగిసినా ఇటు అధికారుల్లోను, అధికార పార్టీ వారికి చలనం లేదు

నగరంలోని అత్యంత జనాలతో రద్దీగా ఉండి ప్రాధాన్యత కలిగిన మయూరి జంక్షన్ నుంచి సీఎంఆర్ షాపింగ్ మాల్ వరకు చేపట్టిన రోడ్డు, సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) సోమవారం విడుదల చేసిన ప్రకటన ద్వారా అధికార పార్టీ జాప్యంఫై ద్వజమెత్తారు.

ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ గడువు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు సకాలంలో జరగలేదని ఆరోపించారు.

ప్రతినిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో నిర్మాణం పనులు నాణ్యత లేకుండా తూతూమంత్రంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం ఈ రోడ్డుపై నడవలేక, వాహనాలను నడపలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 92.10 లక్షల రూపాయల అంచనాలతో టెండర్లు పిలువగా 83.33 లక్షల రూపాయలకు కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నారని, గత ఏడాది సెప్టెంబర్ 4వతేదీన సాంకేతికపరమైన అనుమతులు ఇవ్వగా అక్టోబర్ 4వతేదీన అగ్రిమెంట్ కుదిరినా.. అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాది జనవరి 19వ తేదీన లోగా మూడు నెలలలో పని పూర్తి చేయాలని, అయితే గడువు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ద్వజమెత్తారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతున్నా.. అసలు కాంట్రాక్టర్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. నగరంలో అభివృద్ధి పనులు జోరుగా చేపడుతున్నామని ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఈ రోడ్డు నిర్మాణ పనులపై కన్నెత్తి చూడటం లేదు. సెంటర్ డివైడర్ నిర్మాణానికి చేపట్టిన సిమెంట్ పనులకు పూర్తిస్థాయిలో వాటరింగ్ కూడా చెయ్యక ఫలితంగా డివైడర్ బీటలు వారుతుందని అన్నారు.

ఇకనైనా ఎమ్మెల్యే గారూ.. సదరు అధికారులు చొరవ తీసుకొని మధ్యలో ఆగిపోయిన రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని జనసేన తరుపున కోరుతున్నామని తెలిపారు.