కబ్జాదారుల నుండి చెరువులను కాపాడండి

  • దేవుడి బంధ, లక్ష్మనాయుడు చెరువు, నెల్లిచెరువుల్లో యథేచ్ఛగా ఆక్రమణలు
  • జిల్లా జాయింట్ కలెక్టర్ కోరిన ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు
  • జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని ఆర్డీవో, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు

పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలో చెరువులను కబ్జాదారుల నుండి కాపాడాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు, జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షులు రేజేటి దయామణి కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుని కలిసి పట్టణంలో జరుగుతున్న చెరువుల కబ్జాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీలోని దేవుడు బంద, లక్ష్మనాయుడు చెరువు, నెల్లిచెరువు, లంకెల చెరువు, కొత్తచెరువు, కోదువాని బంధ, సంఘం నాయుడు చెరువు, కామయ్య బంధ, వరహాల గెడ్డ తదితర కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ చెరువులు, స్థలాలు కబ్జాకు గురవుతున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా కొంతమంది అక్రమార్కులు జెసిబిలు, ట్రాక్టర్లు, లారీలు తదితర యంత్రాలతో పనులు చేస్తూ కబ్జా చేస్తున్నారన్నారు. కొందరు పక్కా భవనాలు నిర్మిస్తున్నారన్నారు. ఇంత జరిగినా, జరుగుతున్న సంబంధిత ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, సచివాలయ అధికారులు, సిబ్బంది నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాబట్టి కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, గెడ్డలను అక్రమార్కుల చెరనుండి విడిపించి రక్షణ కల్పించాలని కోరారు. ఆయా చెరువులు, ప్రభుత్వ స్థలాలు సర్వే చేయించి, సరిహద్దులు ఏర్పాటు చేసి కబ్జా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చెరువులు, కబ్జా విషయమై తమ విధులు నిర్వర్తించకుండా అజాగ్రత్తగా, చర్యలు చేపట్టని అధికారులు, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీవో, ఇరిగేషన్ ఈ ఈ, మున్సిపల్ కమిషనర్ లతో మాట్లాడి తక్షణమే ఉమ్మడి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే మున్సిపల్ రెవెన్యూ అనుమతులు లేని భవనాలను తొలగించాలని ఆదేశించారు.