తిరుమల నడకదారిలో భక్తులకు రక్షణ కల్పించాలి: డా. పసుపులేటి

  • అడవిలో అలజడి
  • ఎర్రచందనం స్మగ్లర్ల ధాటికి తట్టుకోలేకపోతున్న వన్యప్రాణులు
  • శేషాచలం అడవుల్లో కూంబింగ్ ను పెంచాలి
  • జనసేన ఉమ్మడి చిత్తూరుజిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత టిటిడిపై ఉందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. అడవిలో ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి వల్లే వణ్యప్రాణులు జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి వస్తున్నాయన్నారు. ఎర్రచందనం చెట్లను యధేచ్చగా నరుకుతూ ఉండటం వల్ల వన్యప్రాణులు భయాందోళనకు గురవుతున్నాయన్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు కూంబింగ్ ను పెంచాలని ఆయన గురువారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో సూచించారు. చేతి కర్రలతో చిరుతల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. పులులు జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి రావడానికి గల కారణాలపై అధ్యయనం జరగాలన్నారు. ఎప్పుడూ జరగని విధంగా తిరుమల నడకదారిలో ఓ చిన్నారిపై పులి దాడి చేసి చంపడం మానవ తప్పిదమేనన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టిటిడి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భక్తుల్లో భయం పోగొట్టేలా టిటిడి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.