వైసీపీ పతనానికి ప్రజా చైతన్యమే నాంది అవుతుంది: ఆళ్ళ హరి

వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని.. ఇచ్చిన హామీలు.. ఆగిన పథకాలు.. పెరిగిన చార్జీలు.. పెంచిన పన్నులు.. జరగని అభివృద్ధిపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలు పలాయనం చిత్తగిస్తున్నారని.. మూడేళ్ళ వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో పెల్లుబుకుతున్న చైతన్యమే వైసీపీ పతనానికి నాంది అవుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. గడప గడపకి కార్యక్రమంలో ప్రజల్లో ప్రశ్నించేతత్వం పెరగటం శుభపరిణామమన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్ళకి మేము గుర్తొచ్చామా అని వైసీపీ నేతల్ని ప్రజలు నిలదీయటంలో తప్పేమీ లేదన్నారు. మాట్లాడితే మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ నేతలు సంక్షేమం పేరుతో చేసే దోపిడీని ప్రజలు గ్రహించారన్నారు. ఒక చేతికి పావలా ఇచ్చి పన్నులు వేసి, చార్జీలు పెంచి మరో చేతితో రూపాయి పావలా లాక్కుంటున్న వైసీపీ ద్వంద పరిపాలనను ప్రజలు గ్రహించే వైసీపీ నేతల్ని ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారని ధ్వజమెత్తారు. తమ గడప తొక్క వద్దు అంటూ నేతల మొహం మీదే తలుపులు వేస్తున్నారు అంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత అసంతృప్తి నెలకొందో అర్ధం అవుతుందన్నారు. తమ సమస్యల్ని వినే నాధుడే లేడని, తమ గోడు మీకు చెప్పినా ఒక్కటే గోడకు చెప్పినా ఒక్కటే అని నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే పరిపాలన ఏ విధంగా ఉందొ తెలుస్తుందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళిత, ముస్లిం, మైనారిటీ, బీసీ, కాపుల వర్గాలన్నింటి వెన్నుని వైసీపీ నేతలు విరిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అందాల్సిన 27 పథకాలకు వైసీపీ ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వటం దళితులను నిలువునా దగా చేయటమేనన్నారు. ముస్లింలకు సంభందించిన దుల్హన్ పధకం, ఇస్లాం బ్యాంక్, విదేశీ విద్యాలంటి ఎన్నో పధకాలను వైసీపీ తుంగలోతొక్కిందని ఇది పేద ముస్లింలకు గొడ్డలిపెట్టు లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దళితులు, ముస్లింలు, బీసీలు, కాపులు నేతల్ని నిలదీయటంతో సమాధానం చెప్పలేని దుస్థితిలో గడప గడప కార్యక్రమాన్ని తూ.. తూ.. మంత్రంగా కానిస్తున్నారన్నారు. మరోవైపు మౌలిక వసతులు కల్పించటంలో పూర్తిగా విఫలమయ్యారని.. అభివృద్ధి అనేమాటని వైసీపీ పరిపాలనా నిఘంటువులో నుంచి తీసేసారా అంటూ.. మహిళలు నేతల్ని నిలదీయటం హర్షించదగ్గ పరిణామామన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తించే వైసీపీ నాయకులు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నల దాడిని తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల అలసత్వాన్ని, అసమర్థతను, అవినీతిని ప్రజలు ఎత్తి చూపిస్తున్న తరుణంలో వైసీపీ కులమతాల గొడవలు పెట్టే రాక్షస క్రీడలకు తెరతీసే ప్రమాదం ఉందని, ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు మరింత జాగరూకతతో ఉండాలని ఆళ్ళ హరి కోరారు. రాష్ట్రంలో నిర్వీర్యం అయిన వ్యవస్థల్ని గాడిలో పెట్టి అవినీతిరహిత సుపరిపాలన అందించేందుకు ప్రజలు జనసేనను ఆశీర్వదించాలని ఆళ్ళ హరి కోరారు. సమావేశంలో మైనారిటీ నాయకులు షర్ఫుద్దీన్, దళిత నాయకులు కొనిదేటి కిషోర్, పమిడి పవన్ తదితరులు పాల్గొన్నారు.