మూలిగే లారీపై త్రైమాసిక పన్ను మోత

*అడ్డగోలుగా పన్నులు పెంచుతున్న వైసీపీ ప్రభుత్వం
* కుదేలైన రవాణా రంగంపై మరింత బాదుడు
* లారీలు నడపలేం అంటున్న వాహనదారులు

కుదేలైన రంగాలను గాడిలో పెట్టాల్సిన వైసీపీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా దెబ్బకు పూర్తిగా నష్టపోయిన రవాణా రంగంపై కక్ష కట్టినట్లుగా పన్నులను బాదుతోంది. ఫలితంగా లారీ యజమానులు వ్యాపారాలు చేయలేమంటూ బెంబేలేత్తుతున్నారు. రకరకాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం వాయిస్తోందని వారు వాపోతున్నారు. తాజాగా త్రైమాసిక పన్నును భారీగా పెంచుతూ జారీ చేసిన జీవోతో లారీ యజమానులు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.
• త్రైమాసిక పన్ను 25 – 35 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీని ద్వారా ఏటా రూ.250 కోట్ల అదనపు బాదుడు వాహనదారులకు తప్పదు. ప్రతి ఏడాది రవాణా శాఖ నుంచి రూ. 4294 కోట్ల ఆదాయం వస్తోంది. దీనిలో త్రైమాసిక పన్నుల రూపంలో రూ.973 కోట్లు వచ్చేది. ఇప్పుడు భారీగా త్రైమాసిక పన్నులు పెంచడంతో ఈ ఆదాయం మరింత పెరగనుంది.
• ప్రతి త్రైమాసికానికి ఆరు టైర్ల లారీపై రూ.850, పది టైర్ల లారీపై రూ.1810, పన్నెండు టైర్ల లారీపై రూ.2390, పద్నాలుగు టైర్ల లారీపై 2950, పదహారు టైర్ల లారీపై 3610 చొప్పున అదనపు భారం పడింది.
• ట్రావెల్ బస్సులపై ఇప్పటి వరకు ప్రతి సీటు, బెర్తుకు రూ.3635 ఉండేది. దీనిని ప్రతి త్రైమాసికానికి రూ.4 వేలు చేశారు. ప్రతి బస్సులో 35 సీట్లు ఉంటాయనుకుంటే త్రైమాసికానికి రూ.1.28 లక్షలు కట్టేవారు. ఇప్పుడు అది రూ.1.40 లక్షలు అయింది.
• త్రైమాసిక పన్ను పెంపుతో హరిత పన్ను భారీగా పెరగనుంది. గతంలో హరిత పన్నును రూ.200 వేసేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 7-10 సంవత్సరాల వాహనాలకు త్రైమాసిక పన్ను విలువలో సగం, 10-12 సంవత్సరాల వాహనాలకు త్రైమాసిక పన్ను మొత్తం, 12 ఏళ్ల పైబడిన వాహనాలకు రెండు త్రైమాసికాల పన్ను వేశారు. తాజాగా త్రైమాసిక పన్ను పెంపుతో హరిత పన్ను కూడా భారీగా పెరగనుంది. 17 ఏళ్ల తర్వాత భారీగా పెరిగిన పన్నులతో లారీ యజమానులు, ట్రావెల్స్ నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ పై రూ. 5 అదనంగా వసూలు చేస్తున్నారు.
• నేషనల్‌ పర్మిట్‌ వాహన యజమానులు ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వాహనాలకు డబ్బులు కట్టినా కార్డులు ఇవ్వటం లేదు. ఏపీకి చెందిన రవాణా వాహనాలు సెంట్రల్‌ గవర్నమెంట్‌ కు చెందిన ఎన్‌ ఐసీ డేటాబేస్‌ లో ఉంటేనే ఇతర రాష్ట్రాలలో దానిని చూసి వే బిల్లు ఇస్తాయి. ‘వాహన్‌ పరివాహన్‌’ సైట్‌ లో ఏపీ లారీల వాహనాల నంబర్లు కనిపించకపోవడంతో ప్రతిసారీ ఉన్నతాధికారుల చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తోందని వాహన యజమానులు వాపోతున్నారు.
• తమిళనాడులో గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.200 కడితే ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 వేలు గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్లు ఇవ్వటానికి 9 సంవత్సరాలుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. పొరుగున తమిళనాడులో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే.. సుమారు 2 లక్షల వరకు మిగులుతుందని వాహన యజమానులు చెబుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆంధ్రప్రదేశ్‌ లోని ఆయిల్‌ను లారీ యజమానులు కొనటం దాదాపు మానేయడంతో డీజిల్ అమ్మకాలు పడిపోయాయి.
• ప్రతి లీటరు డీజిల్‌పై సెస్‌ విధిస్తున్నారు. సెస్‌తో రోడ్లు వేస్తున్నారంటే అదీ లేదు. రాష్ట్రంలోని రోడ్లపై వాహనాలు వెళ్లాలంటే కమాన్‌ కట్టలు విరిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం 16 నుంచి 9 శాతం రోడ్డు ఖర్చును తగ్గించాలని చెబుతున్నా, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.