ప్రశ్నిస్తే ఊసలు లెక్క పెట్టాలా?

*ప్రజా వ్యతిరేక విధానాలపై గోడపత్రిక
*పార్టీలకు అతీతంగా పోరాటాలకు సిద్ధం కావాలి
*ధ్వజమెత్తిన జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు చరమగీతంపాడే రోజులు దగ్గరపడ్డాయని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. స్థానిక జనపార్టీ కార్యాలయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గోడపత్రికలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వైసిపి పాలన రాష్ట్ర ప్రజలను ఊసలు లెక్కెట్టే పరిస్థితికి తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్న కార్మిక, ఉద్యోగ, నిరుద్యోగుల పై తప్పుడు కేసులను బనాయించి కటకటాల పాలు చేస్తున్నారన్నారు. ఎవరైనా తమ హక్కుల కోసం పోరాడితే వారిపై అధికార ఝలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు జనసేన పార్టీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తుందన్నారు. మానవ హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. అధిక ధరల కారణంగా పేదల కష్టమంతా మద్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఈ ప్రభుత్వంలో పని లేకుండా పోయిందన్నారు. ఇసుక, ఐరన్ ధరలు ఆకాశాన్ని అంటుకున్న కారణంగా భవన నిర్మాణ దారులు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగుల కోసం ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలండర్‌ను విడుదల చేస్తానని నమ్మబలికి ఎన్నికల్లో గెలిసిన తరువాత జాబ్ క్యాలండర్ విషయాన్ని ముఖ్యమంత్రి మరిచిపోయారన్నారు. ప్రతీ సంవత్సరం అందిస్తానన్న జాబ్ గ్యాలండర్ పై నిరుద్యోగులు ప్రశ్నిస్తుంటే వారిపై సంకెళ్లను విధిస్తున్నారన్నారు. సిపిఎస్ రద్దు హామీలను మరిచిన రాష్ట్ర ప్రభుత్వం జీతాలకే ఎసరుపెట్టిందన్నారు. కేంద్రం అందించిన పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేసిందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఏవిధంగా జీవిస్తారో అర్థం చేసుకోలేని రాష్ట్ర ప్రభుత్వం పై జనసేన పోరాటానికి సిద్ధమైందన్నారు. ఈ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు చరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి,జాయింట్ సెక్రటరీ ఎట్రంచి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బొండా రాము, నాయకులు పసుపులేటి దినేష్, పైడి లక్ష్మణరావు, నాగభూషణం, చందు తదితరులు పాల్గొన్నారు.