రవాణాశాఖలో పన్నుల పెంపు.. ఏ పి సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుoది. ఈ ప్రయత్నం లో బాగంగా రవాణాశాఖలో పన్నులు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పన్నుల పెంపు ద్వారా రవాణాశాఖ నుంచి అదనంగా సుమారు రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. టూవీలర్, ఫోర్ వీలర్ల లైఫ్ ట్యాక్స్ పెంచుతూ రవాణాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రెండు రకాల శ్లాబుల్లో ప్రస్తుతం ఉన్న పన్ను మీద 1- 3 శాతం మేర పెంపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం 9.12 శాతంగా ఉన్న టూవీలర్, ఫోర్ వీలర్ లైఫ్ ట్యాక్స్‌ను 2010 తరువాత పెంచలేదు.

టూ వీలర్లకు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా రూ. 174 కోట్ల మేర ఆదాయం అదనంగా వస్తుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫోర్ వీలర్లకు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా సుమారు రూ. 140 కోట్ల ఆదాయం అదనంగా వస్తుందని భావిస్తోంది. గూడ్స్ వాహనాలకు వివిధ శ్లాబుల్లో ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే10-15మేర పెంపు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. వివిధ వాహనాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ రేట్ల పెంపు ద్వారా అదనంగా రూ. 30 కోట్లు ఆదాయం వచ్చేలా కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే గ్రీన్ ట్యాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.