జనవరి 1 నుంచి ఏపీలో ఇంటికే రేషన్ సరుకులు

రేషన్ డెలివరీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన స్టోర్టెక్స్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. నాణ్యమైన బియ్యాన్నిఅందరికీ అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కారు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. రేషన్ పంపిణీకి సంబంధించి మినీ వ్యాన్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. జైపూర్ నుంచి గుంటూరుకు ఇప్పటికే 120 మినీ వ్యాన్లు చేరుకున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత శ్రీకాకుళంలో డోర్ డెలివరీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జనవరి 1వతేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని రేషన్ కార్డు దారులకు ఇంటికే డైరెక్ట్ గా బియ్యం డోర్ డెలివరీ జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం 9,260 మినీ వ్యాన్లను కొనుగోలు చేసింది. వీటికి డ్రైవర్లను త్వరలోనే ప్రభుత్వం నియమించబోతున్నది.

స్వయం ఉపాధి పధకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు.. ఈ బియ్యం ఇంటింటికీ డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. కాగా, ఈ వాహనాలకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పది శాతం డబ్బును చెల్లించి యువత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు.