నాదెండ్ల మనోహర్ పర్యటనపై ఆంక్షలు

• అడుగడుగునా వాహన శ్రేణికి పోలీసుల ఆటంకాలు
• తూరంగి వద్ద రోడ్డుపై బైఠాయించిన జనసేన నేతలు
• పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాదెండ్ల మనోహర్

కాకినాడ జిల్లాలో జనసేన కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తూ.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటనకు ఆటంకాలు కలిగిస్తున్నారు. కాకినాడలో మీడియా సమావేశం అనంతరం ముమ్మడివరం నియోజక వర్గానికి బయలుదేరిన శ్రీ మనోహర్ గారిని ముత్తా క్లబ్ దగ్గరే అడ్డుకోవాలని చూశారు. అయితే ఆయన వాహనాన్ని మినహా మిగిలిన నాయకుల వాహనాలు నిలిపి వేశారు. ఆ వాహనాలు వదిలేవరకు కదిలేది లేదని మనోహర్ చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కాకినాడ నగరంలో అడుగడుగునా జనం సాదరంగా స్వాగతం పలికి జేజేలు పలికారు. కాకినాడ నగరం సరిహద్దుల్లో మరోసారి వాహన శ్రేణిని అడ్డుకున్నారు. అది గమనించిన మనోహర్ తూరంగి వద్ద వాహనశ్రేణిని నిలిపివేశారు. పీఏసీ సభ్యులు పంతం నానాజీ పార్టీ నాయకులతో కలసి రోడ్డు మీద బైఠాయించారు. దీంతో పోలీసులు మరోసారి దిగి వచ్చి జనసేన నాయకుల వాహనాలను వదిలేశారు. పోలీసుల తీరు పట్ల నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.