రెవెన్యూ మోసాలపై విచారణ జరిపించాలి – యుగంధర్ పొన్న డిమాండ్

గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం మండలంలో జరిగిన రెవెన్యూ మోసాలపై అవినీతి నిరోధక శాఖ ద్వారా విచారణ చేయించాలని జనసేన గంగాధర నెల్లూరు నియోజక వర్గం ఇంఛార్జి పొన్నా యుగంధర్ డిమాండ్ చేశారు. దొంగ పాస్ బుక్కులు, నకిలీ పట్టాలపై విచారణకు ఎప్పుడు అదేశిస్తారంటూ ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామిని నిలదీశారు. తూతూ మంత్రంగా రెవెన్యూ విచారణల వల్ల లాభం లేదని చెప్పారు. టిడిపి నుంచి వైకాపాలో చేరిన ఒక దళిత నాయకుడు, మరొక అగ్రకుల నేత కలసి మండలాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు.అలాగే కొందరు పాత దొంగలు, అధికార పార్టీ నాయకులు అనేక మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వందలాది ఎకరాల భూములను కబ్జా చేసిన తమ పార్టీ నేతలను స్వామి వెనకేసుకు వస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు ఒత్తిళ్ళకు లొంగి, లంచాలకు ఆశపడి అక్రమార్కుల కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్నానని గొప్పలు చెప్పుకునే స్వామికి భూ కబ్జాలు, చీకటి వ్యాపారాలు కనపడక పోవడం వింతగా ఉందన్నారు. నారాయణ స్వామికి చిత్తశుద్ది ఉంటే తక్షణం విచారణకు ఆదేశించి, అక్రమాలను ప్రక్షాళన చేయాలని కోరారు. లేని పక్షంలో తాను రెవెన్యూ అక్రమాలపై ఉద్యమిస్తానని హెచ్చరించారు.