ఉసూరుమంటున్న ఉన్నత విద్య!

* విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరత
* 71 శాతం ఖాళీలతో కుంటుపడుతున్న బోధన
* వర్శిటీల నిధులకు కూడా ప్రభుత్వం గండి
* పీజీ ఫీజులు రూ. 450 కోట్ల బకాయి
* దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు
* బోధన సిబ్బందిపై అధిక పని ఒత్తిడి
* పట్టంచుకోని వైకాపా ప్రభుత్వం

”మాటలు కోటలు దాటతాయి… చేతలు గడప దాటవు”!
ఈ సామెత వైకాపా ప్రభుత్వం పనితీరుకు అక్షరాలా సరిపోతుంది.
అన్ని వ్యవస్థలను నీరుగారుస్తున్న ఈ వ్యవహార శైలి రాష్ట్రంలో ఉన్నత విద్యను దారుణంగా దెబ్బతీస్తోంది.
”దేశంలోని ఏ ప్రాంతంలోని విద్యార్థులైనా ఆంధ్రప్రదేశ్‌ రావాలని ఉవ్విళ్లూరేంత బాగా ఉన్నత విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతాం…” అంటూ ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతూ వస్తున్నారు.
అయితే వట్టి మాటలే తప్ప గట్టి చేతలు లేవని చెప్పడానికి ఈ రంగంలో ఉన్న అనేక సమస్యలను విహంగ వీక్షణం చేసినా సరిపోతుంది. వైకాపా ప్రభుత్వం కొలువుదీరి మూడున్నరేళ్లు దాటుతున్నా, తీర్చిదిద్దడం మాట అటుంచి, ‘నానాటికి తీసికట్టు నాగంభొట్లు’ అన్నట్టుగా ఉన్నత విద్యా వ్యవస్థ కునారిల్లుతోంది.
రాష్ట్రంలో మొత్తం 57 యూనివర్శిటీలు ఉన్నాయి. వీటిలో 3 సెంట్రల్‌ యూనివర్శటీలు, 20 అటానమస్‌ ఇనిస్టిట్యూషన్లు, 25 స్టేట్‌ యూనివర్శిటీలు, 4 డీమ్ఢ్‌ యూనివర్శిటీలు, 5 ప్రైవేటు యూనివర్శిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి నుంచి పీహెచ్‌డీ వరకు చూసుకుంటే మొత్తం 14,94,538 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కేసి దృష్టి సారిస్తే జగన్‌ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా గోచరమవుతాయి.
*సిబ్బంది కొరతతో ఇబ్బంది…
రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో కలిపి మంజూరైన బోధన పోస్టులు 3,864 ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్నవారు కేవలం 1100 మందే. అంటే దాదాపు 71 శాతం పైగా ఖాళీలు ఉన్నాయన్నమాట. మరో మూడు నాలుగు నెలల్లో పదవీ విరమణ చేసేవారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. నియామకాలపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నత విద్య ఆశయాన్నే నీరుగారుస్తోంది.
జగన్‌ ప్రభుత్వం కొలువైన ఈ మూడున్నరేళ్లలో విశ్వవిద్యాలయాల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదంటే నిర్లక్ష్యం ఏ మేరకు పేరుకుపోయిందో అవగతమవుతుంది. సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ పదే పదే చెప్పినా, ఇంతవరకు నోటిపికేషన్ రాకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనంగా నిలుస్తోంది.
*ఆదుకోకపోగా…ఆరగింపు…
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం వర్శిటీల్లోని నిధులపై కూడా కన్నేసింది. ఈ నిధులను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలంటూ లాగేసుకుంటోంది. విశ్వవిద్యాలయాలను నిధులిచ్చి ఆదుకోవలసిందిపోయి, విద్యార్థుల ఫీజులు ఇతరత్రా రూపంలో వచ్చే నిధులను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్ లో డిపాజిట్‌ చేయిస్తూ… ఆ సొమ్మును ఇతరత్రా కార్యకలాపాలకు నిర్లజ్జగా వాడుకుంటోంది. ఇప్పటి వరకు వర్శిటీలు దాదాపు రూ. 150 కోట్లను డిపాజిట్‌ చేశాయి. వీటిని తిరిగి ప్రభుత్వం నుంచి తీసుకోలేని పరిస్థితిలో విశ్వవిద్యాలయాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
*ఫీజుల చెల్లింపు హుళక్కి…
ఇక ఫీజు రీయింబర్స్ మెంటు విషయానికి వస్తే పరిస్థితి మరీ ఘోరం. పూర్తి ఫీజును రీయింబర్స్‌ చేస్తామంటూ ప్రచారం చేసుకుంటూనే విడుదలలో కోతలు విధిస్తోంది. 2020-21లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నాలుగో క్వార్టర్‌ ఫీజును చెల్లించలేదు. దాంతో చాలా కళాశాలలు ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నాయి. ఇది వేలాది మంది విద్యార్థులను, తల్లిదండ్రులను కలవరపెడుతోంది. మరో వైపు ప్రైవేటు కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ లో చేరే విద్యార్థులకు ఫీజుల చెల్లింపును ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పీజీ చదివే విద్యార్థుల సంఖ్య పడిపోయింది. కరోనాతో కళాశాలలు సరిగా జరగలేదనే నెపంతో నాలుగో క్వార్టర్‌ ఫీజును ప్రభుత్వం చెల్లించలేదు. ఇలా దాదాపు రూ. 650 కోట్లను ఇవ్వలేదు. అయితే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేసి పాఠాలు చెప్పామనే కారణంతో చాలా కళాశాలలు మాత్రం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయి. ప్రైవేటు కాలేజీల్లో పీజీ విద్యకు బోధన రుసుమును 2020-21 నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, అప్పటి వరకు చెల్లించాల్సి ఉన్న బకాయిలకు కూడా మొండి చెయ్యి చూపించింది. ఇలా మొత్తం రూ. 450 కోట్ల రూపాయలకు కొర్రీ పెట్టింది.
*ఉప కులపతి కూడా లేని దుస్థితి…
ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాప్రమాణాలకు సంబంధించి ఉప కులపతి పాత్ర కాదనలేనిది. అలాంటిది ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించిన రాజీవ్‌ గాంధీ వైజ్క్షానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి మూడున్నరేళ్లుగా కనీసం ఉపకులపతిని సైతం నియమించలేదంటే… వైకాపా ప్రభుత్వం నిర్వాకమెలాంటిదో అర్థమవుతుంది. ట్రిపుల్‌ ఐటీల్లో 665 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ భవన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇక్కడ భవన నిర్మాణాలకు, వసతుల కల్పనకు సుమారు రూ. 1200 కోట్లు అవుతాయని అంచనా వేయగా, తొలి దశకు సంబంధించిన రూ.200 కోట్లలో ఒక్క పైసాను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. శ్రీకాకుళంలో ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాలేదు. దాంతో విద్యార్థులు వేరే చోట్ల సర్దుకుంటూ అరకొర వసతులతో, పరిమితికి మించిన విద్యార్థులున్న గదుల్లో సతమతమవుతున్నారు.
*ఏయూలో ఎన్ని సమస్యలో…
రాష్ట్రానికే గర్వకారణమైన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఎందరో విశిష్ట మేధావులను అందించిన చరిత్ర ఉంది. అలాంటి ఏయూ ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ 936 పోస్టులకు గాను రెగ్యులర్‌ ఆచార్యులు 216 మందే ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏయూ ఇంతవరకు రూ. 10 కోట్లను కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేసింది. జీత భత్యాలు, పింఛన్లకు రూ.366 కోట్లు, మినిమం టైమ్ స్కేల్లో పనిచేసేవారికి మరో రూ. 26 కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం అన్నింటికీ కలిపి రూ. 280 కోట్లే ఇస్తోంది. దీంతో ఏయూ ఆర్థిక భారంతో సతమతమవుతోంది.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు… కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు… ఉన్నత విద్యా వ్యవస్థ అనేక సమస్యలు, లోపాలతో అంతకంతకు కునారిల్లుతోంది.
కర్ణుడి చావుకి కారణాలు అనేకమే కావచ్చు…
కానీ ఉన్నత విద్య ఉసూరుమనడానికి మాత్రం కారణం ఒక్కటే…
అది… జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం!