RR vs DC: మోరీస్‌ మెరుపులు.. రాజస్థాన్‌ గెలుపు

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది. డేవిడ్‌ మిల్లర్‌(62: 43 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధశతకానికి తోడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరీస్‌(36 నాటౌట్‌: 18 బంతుల్లో 4సిక్సర్లు) ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపించడంతో రాయల్స్‌ విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ ఇంకో రెండు బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(2), మనన్‌ వోహ్రా(9), కెప్టెన్‌ సంజూ శాంసన్‌(4) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా క్రిస్‌ వోక్స్‌, రబాడ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఆరంభంలోనే రాజస్థాన్‌ పేసర్‌ఉనద్కత్‌ ధాటికి పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన క్యాపిటల్స్‌ టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. టాప్‌-3 బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా(2), శిఖర్‌ ధావన్‌(9), రహానె(8)లను తన వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపి ఢిల్లీని దెబ్బ కొట్టాడు.

ముస్తాఫిజుర్‌ వేసిన ఏడో ఓవర్లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినీస్‌ ఔటవడంతో ఢిల్లీ 37/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న పంత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. హాఫ్‌సెంచరీ సాధించి దూకుడుమీదున్న పంత్‌ 13వ ఓవర్లో రనౌటయ్యాడు. దీంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో లలిత్‌ యాదవ్‌(20), టామ్‌ కరన్‌(21) ఫర్వాలేదనిపించారు. ఆరంభం నుంచి రాయల్స్‌ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయలేకపోయింది. రాజస్థాన్‌ బౌలర్లలో ఉనద్కత్‌ మూడు వికెట్లు తీయగా..ముస్తాఫిజుర్‌ రహమాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.