హుస్సేన్‌సాగర్‌లో నిమ‌జ్జ‌నాల‌కు రబ్బరు డ్యాం!

హైద‌రాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాల విష‌యంలో క‌ఠిన ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క‌చ్చితంగా వాటిని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. ప్ర‌ధానంగా హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయ‌వ‌ద్ద‌ని తేల్చి చెప్పింది. ప్రత్యేక కుంట‌ల్లోనే వాటిని నిమజ్జనం చేయాలని సూచించింది. ఇక ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని తెలిపింది.

నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. అన్ని ప్రాంతాల నుంచి విగ్ర‌హాలు ఒకే రోజు హుస్సేన్ సాగర్‌కు రాకుండా ప్రణాళిక రూపొందించుకోవాల‌ని తెలిపింది. ఇక చిన్న విగ్రహాలను ఇళ్లలోనే, బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని వెల్ల‌డించింది.

నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని.. అలాగే నిమజ్జనం తర్వాత వెంటనే డెబ్రీస్ తొలగించాలని హైకోర్టు తెలిపింది. భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని కోరింది. రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని, మండపాల వద్ద ఎక్కువమంది గుమిగూడకుండా చూడాలని సూచించింది. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని, రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని హైకోర్టు ఆదేశించింది. మండపాల వ‌ద్ద నిర్వాహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాల‌ని తెలిపింది హైకోర్టు.