వైఎస్ కుటుంబం నుంచి మరో “ప్రజాప్రస్థానం” – పాదయాత్రకు షర్మిల రెడీ !

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. చేవెళ్ల టు చేవెళ్ల దాదాపుగా 4వేల కిలోమీటర్లు .. 400 రోజుల పాటు చేయనున్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రను గుర్తు చేయాలనుకుంటున్నారు. పాదయాత్రగా అధికారానికి దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. కుటుంబంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ తర్వాత ఆ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించాలని అనుకుంటున్నారు.

పాదయాత్రల్లో వైఎస్ వారసత్వం కొనసాగింపు !
పాదయాత్ర అంటేనే గుర్తు వచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్జి. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించి .. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వైఎస్, ఆయన తనయ షర్మిల సైతం ప్రభుత్వ విధివిధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పాదయాత్రనే అస్త్రంగా ఎంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడ్డాయా.. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగుల కలలు నిజమయ్యాయా? అని తెలుసుకునేందుకు షర్మిల యాత్రను చేపట్టారు. రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో పార్టీ పెట్టానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు.