వార్మప్ మ్యాచ్ లో కుమ్మేసిన కుర్రోళ్లు..!

టీ-20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో మనోళ్లు కుమ్మేశారు. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించారు. ఇంగ్లండ్ తో జరిగిందీ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. బెయిర్ స్టో 49, మొయిన్ అలీ 43 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, చాహర్ చెరో వికెట్ తీశారు.

189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా. ఆదినుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ దుమ్మురేపారు. రాహుల్ 24 బంతుల్లో 51 రన్స్ చేయగా.. కిషన్ 46 బంతుల్లో 70 రన్స్ చేశాడు. చివరిలో రిషబ్ పంత్(29), హార్దిక్ పాండ్య(16) మెరుపులు మెరిపించారు.

19 ఓవర్ సమయానికి 20 పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి బంతిని ఫోర్ పంపాడు పాండ్యా. రెండు, మూడు బంతులకు పరుగులేమీ రాకపోయినా.. నోబ్ ప్లస్ ఫోర్ వెళ్లడంతో ఐదు రన్స్ వచ్చాయి. తర్వాతి బంతిని కూడా బౌండరీ దాటించాడు పాండ్యా. నెక్ట్స్ బాల్ కి ఇంకో రెండు పరుగులు తోడయ్యాయి. ఓవర్ లో చివరి బంతి సిక్సా, ఫోరా అని అందరూ అనుకుంటున్న సమయంలో బౌలర్ మళ్లీ నోబ్ వేశాడు. ఓ రన్ అదనంగా యాడ్ అయింది. పంత్ విన్నింగ్ షాట్ సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ 6వికెట్ల తేడాతో గెలుపొందింది.