రుషి కొండను గుండు కొట్టినట్టు కొట్టేశారు..
* ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆర్థిక వనరులను అడ్డగోలుగా దోచేసుకుంటున్నారు
* వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై తప్పని సరిగా ప్రశ్నిస్తాం
* విజయనగరం మీడియాతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు
వై.సీ.పీ. ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తున్నారు అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన దానికి స్పందిస్తూ.. “రుషి కొండను గుండు కొట్టినట్టు కొట్టేసిన విషయం మీడియా ద్వారానే తెలిసిందని మరి అలాంటప్పుడు అడగకుండా ఎలా ఉంటామని..” వివరించారు జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా మీడియా ప్రతినిధులతో నాగబాబు మాట్లాడారు. వై.సీ.పీ. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని ఒక మీడియా ప్రతినిధి అదే పనిగా అడిగిన దానికి స్పందిస్తూ.. వై.సీ.పీ. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై మీడియా కోడై కూస్తోందని., మీడియాలో వస్తోన్న కథనాలకు సంబంధించి నిజానిజాలు నిర్ధారణ చేసుకున్నాకే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నామని అన్నారు. రాజకీయ పార్టీలను పేరు పెట్టి విమర్శించడం తమ అభిమతం కాదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం తప్పనిసరిగా ప్రశ్నిస్తాం అని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. పార్టీ పొత్తుల విషయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిదే అంతిమ నిర్ణయమని జనసైనికులుగా మేమంతా ఆయన నిర్ణయమే శిరోధార్యంగా శిరసా వహిస్తామని అన్నారు. పార్టీ జిల్లాల వారీగా నాయకత్వంకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన దానికి స్పందిస్తూ జనసేనలో ప్రతీ కార్యకర్త నాయకుడిగా పని చేస్తారని, కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే జనసేన పార్టీ ప్రధాన విధానమని అన్నారు. ఆ కోవలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారు అని అన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శ్రృంగవరపుకోట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశమై పార్టీ బలోపేతం దిశగా నిర్దేశం చేసినట్లు, అవకాశం దొరికినప్పుడల్లా విజయనగరం జిల్లా పర్యటిస్తామని, విజయనగరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కార్యకర్తలతో మాట్లాడుతానని స్పష్టం చేసారు.