విజయనగరం అభివృద్ధిని అణగదొక్కుతున్న వారికి విశ్రాంతినిద్దాం

* ఉత్తరాంధ్రలో దోపిడీకి గురవుతున్న విలువైన ఆర్థిక వనరులను కాపాడుకుందాం
* జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు

విజయనగరం జిల్లాను తమ ఆధిపత్య రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న నాయకులకు విశ్రాంతినిచ్చి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేందుకు జనసేను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గురువారం విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల వారిగా జరిగిన సమావేశాల్లో నాగబాబు కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు. ఖనిజాలు, నదులు, మత్స్య సంపద, ఇంకెన్నో విలువైన ప్రకృతి వనరులు, ఆర్థిక వనరులు ఉన్న ఉత్తరాంధ్రను వెనుక బడిన ప్రాంతం అని ఊత పదంగా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. ఇంత గొప్ప ఆర్థిక వనరులు ఉన్న ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లి బ్రతకాల్సిన దుస్థితి ఏమిటి అనేది ఇప్పటికీ అంతు చిక్కని సవాలు అని పేర్కొన్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర వెనుక బడిన ప్రాంతం కాదని వెనక్కు నెట్టబడుతున్న ప్రాంతం అని స్పష్టం చేసారు. అధికార పార్టీ అండతో అందినంతవరకు దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలను బానిసలుగా తయారు చేసి మేము ఇంతకన్నా ఎదగలేము అనే భావన ప్రజల్లో తీసుకు వచ్చారని, ప్రజలను ఇంకా ఎంత గొప్పగా ఎదగవచ్చు అనేది జనసేన చేసి చూపిస్తుందని అన్నారు. దోపిడీకి గురవుతున్న విజయనగరం జిల్లా అభివృద్ధికి జనసేన వద్ద ప్రణాళిక ఉన్నదని అన్నారు. జనసైనికులే నాయకత్వ బాధ్యతలు తీసుకొని పార్టీ గెలుపు కోసం పని చెయ్యాలని సూచించారు. సాధ్యమైనంత తొందరలో అన్ని నియోజక వర్గాలకు, మండలాలకు ఇంచార్జీలను, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసే విధంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. కార్యకర్తలు అంతా పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో, నియోజకవర్గం బాధ్యులతో సమన్వయంతో పార్టీ కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శ్రృంగవరపుకోట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.