ఎమ్మెల్యే రాపాకకు షాక్.. రాజోలులో జనసైనికుల ప్రభంజనం

రాజోలులో ఎమ్మెల్యే రాపాకకు షాక్‌ తగిలింది. జగన్‌కు జై కొట్టిన వరప్రసాద్‌కు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్ల్లో జనసేన తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక. ఏపీ మొత్తం మీద జనసేన తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా కాలరు ఎగరేశారు రాపాక. తరువాత జరిగిన పరిణామాలతో తను పవన్ పేరు చెప్పుకుని గెలుపొందలేదని.. తన సొంత బలంతోనే నెగ్గాను అంటూ పలుసార్లు చెప్పుకొచ్చారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. పార్టీ అధినేత నిర్ణయాలను ధిక్కరిస్తూ జగన్ కు జై కొట్టారు. అప్పటి నుంచి వైసీపీ వెంటే తిరుగుతున్నారు. అసలు రాజోలులో పవన్ కు ఇమేజ్ లేదు అన్నట్టు కామెంట్లు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులు ఊహించని షాక్ ఇచ్చారు. తమ అధినేతకు వెన్నుపోటు పొడిచిన ఎమ్మల్యేలకు తగిన గుణపాఠం చెప్పాము అంటున్నారు జనసేన కార్యకర్తలు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం రాజోలులో జనసేన సర్పంచ్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 16 స్థానాలకు పైగా తమదే విజయం అంటున్నారు జనసైనికులు.. ట్విట్టర్లో గెలుపొందిన వారి పేర్లు.. వారికి వచ్చిన మెజార్టీలు కూడా పెడుతున్నారు. మరికొందరు 20 స్థానాలకు పైగా తమదే విజయం అంటున్నారు.

అందిన సమాచారం మేరకు ఫలితాలు చూస్తే పడమటిపాలెం, టెకిశెట్టిపాలెం, కేశవాదాసుపాలెం, కాట్రేనిపాడు, ఈటుకూరు, మేడిచర్ల పాలెం, బట్టేలంక, రామరాజులంక, కత్తిమండ, కూనవరం, గోగునమ్మటం, తూర్పుపాలెం, సఖినేటిపల్లి లంక, కేశవాదాసుపాలెం, కాట్రేనిపాడు, ఈటుకూరు, మేడిచర్ల పాలెం, బట్టేలంక, రామరాజులంక, కత్తిమండ, కూనవరం, అమలాపురం, అంతర్వేది తదితర పంచాయతీల్లో జనసేన సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన మద్దతు దారులు 30 చోట్ల గెలుపొందితే అందులో ఒక్క రాజోలులోనే16 సీట్లలో జనసేన మద్దతు దారులు గెలుపొందారు.

స్థానిక ఎమ్మెల్యేగా రాపాక వైసీపీకి మద్దతు ప్రకటించినా.. స్థానికులు మాత్రం రాపాకకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎమ్మల్యే పార్టీ మారినా.. తామంతా అధినేత వెంటే ఉన్నామంటూ అక్కడి స్థానికులు ఈ ఎన్నికల ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు సంబరాలు చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలో వరుసగా ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో పెడుతూ ఎమ్మెల్యే రాపాకను ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. మరి మొత్తం ఫలితాలు వచ్చాక ఎవరు ఎన్నిసీట్లు గెలిచారు అన్నదానిపై క్లారిటీ వస్తుంది. అయితే ఇందులో గెలిచినవారంతా దాదాపు పార్టీతో సంబంధం లేకుండా పోటీలో నిలిచినవారే. తమ అధినేతపై ఉన్న అభిమానంతో స్నేహితుల సహకారంతో ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు.