విద్యుత్తు కోతలతో రొయ్య రైతు విలవిల

* రోజుకు 4 నుంచి 12 గంటలు అందని కరెంట్
* జనరేటర్లతో సాగు ఖర్చులు తడిసిమోపెడు
* సగానికి పడిపోయిన రొయ్యల ప్రాసెసింగ్
* భారంగా మారిన ఐస్ తయారీ
* పుండు మీద కారంలా ధరలూ తగ్గాయి

ఆక్వా సాగులో దేశంలోనే ఏపీ నెంబర్ వన్. ఇక రొయ్యల సాగులోనూ మనదే అగ్రస్థానం. దేశంలో ఏటా 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే అందులో 7 లక్షల టన్నులు ఏపీ నుంచే ఉత్పత్తి జరుగుతోంది. రొయ్యల ఎగుమతుల్లోనూ మనమే టాప్. రొయ్యల ఎగుమతుల ద్వారా ఏటా ఏపీకి రూ.16000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం కూడా వస్తోంది. అయితే నెల రోజులుగా కరెంటు కోతలతో రొయ్య రైతులు విలవిల్లాడుతున్నారు. రొయ్యల పెంపకంలో ఆక్సిజన్ చాలా కీలకం. సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు రొయ్యలకు ఆక్సిజన్ అందించేందుకు ఏరేటర్లు తిప్పాల్సి ఉంటుంది. చెరువుల్లో ఏ మాత్రం ఆక్సిజన్ తగ్గినా రొయ్యలు మృత్యువాత పడతాయి. అందుకే ఒక్క అరగంట కరెంటు పోయినా వెంటనే జనరేటర్లతో ఏరేటర్లు నడపాల్సి ఉంటుంది. కరెంటు కోతల నేపథ్యంలో అంతంత ఖర్చు చేసి జనరేటర్లతో ఏరేటర్లు నడపలేక రొయ్య రైతులు కుదేలవుతున్నారు.

కరెంటు కోతలతో రొయ్యల సాగు రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం రొయ్యల సాగు చేస్తున్న రైతులకు యూనిట్ రూ.3కు రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తోంది. అయితే గత నెల రోజులుగా కరెంటు కోతలు అధికం అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో రోజుకు 4 గంటల నుంచి 12 గంటలు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. దీంతో రొయ్యల సాగు రైతులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. చెరువుల్లో ఏరేటర్లు నడిపించి ఆక్సిజన్ తగ్గకుండా చూసుకునేందుకు డీజిల్ జనరేటర్లు నడపాల్సి వస్తోంది. 30 కేవీ, 40 కేవీ జనరేటర్లకు నెలకు పది వేలు, 63 కేవీ జనరేటర్లకు నెలకు రూ.12000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక రైతులు ఎకరా చెరువులో ఏరేటర్లు నడపడానికి రోజుకు రూ.1300 డీజిల్ కోసం ఖర్చు అవుతోంది. అంటే పదెకరాల్లో రొయ్యల సాగు చేస్తే జనరేటర్లు, డీజిల్ ఖర్చు రోజుకు రూ.13000 దాటిపోతోంది. నెలకు పదెకరాల రొయ్యల సాగుకు అదనంగా రూ.4 లక్షలు ఖర్చవుతోంది. ఇలా డీజిల్ జనరేటర్లతో రొయ్యల సాగు చేస్తే ఖర్చులు పెరిగిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే నెల రోజుల నుంచి రొయ్య సాగు రైతులు తీవ్ర విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారు. ఇక మే మాసంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే రొయ్య రైతులు పెద్దఎత్తున అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
*ప్రాసెసింగ్ పరిశ్రమల్లో కార్మికుల ఉపాధికి గండి
రొయ్యల సాగులో ఉభయ గోదావరి జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. తరువాత కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. ఏపీలో 80 వేల హెక్టార్లలో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 30 వేల హెక్టార్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 25 వేల హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 15 వేలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి 8 వేల హెక్టార్లు, మిగిలిన జిల్లాల్లో మరో 2 వేల హెక్టార్లలో రొయ్యలు సాగు చేస్తున్నారు. దేశంలోని మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 75.84 శాతం ఒక్క ఏపీ నుంచే జరుగుతోంది. రొయ్యల సాగు, ప్రాసెసింగ్ ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. కరెంటు కోతలతో ఒక వైపు రైతులు తీవ్రంగా నష్టపోగా కూలీలు, కార్మికులు కూడా రోడ్డున పడ్డారు. ఏపీలోని 97 ప్రాసెసింగ్ పరిశ్రమల్లో సగటున వెయ్యి మంది చొప్పున పనిచేస్తున్నారు. కరెంటు కోతలతో 50 శాతం ప్రాసెసింగ్ నిలిపివేశారు. దీంతో ఒక్కో పరిశ్రమలో కార్మికులను వెయ్యి నుంచి 300లకు తగ్గించారు.
*ఐస్ దొరకక అగచాట్లు
చెరువులో పట్టినప్పటి నుంచి ప్రాసెస్ చేసే వరకు కిలో రొయ్యకు ఐదు కిలోల ఐస్ అవసరం అవుతుంది. ఐస్ తయారీ పరిశ్రమలకు రోజుకు 12 గంటల విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. దీంతో క్యాన్ ఐస్ గత నెల ప్రారంభంలో రూ.150 ఉండగా నేడు రూ400లకు పెంచారు. ఐస్ తయారు కావాలంటే 24 గంటలు నిరంతరాయంగా కరెంటు సరఫరా ఉండాలి. రోజుకు కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడంతో, మిగిలిన 12 గంటలు జనరేటర్లతో ఐస్ తయారు చేయాల్సి వస్తోంది. దీంతో ఐస్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఈ భారం కూడా రైతులపైనే పడింది. చాలా మంది ఐస్ తయారీ దారులు డీజిల్ ఖర్చులు భరించలేక ఐస్ తయారీ నిలిపి వేశారు. దీంతో రొయ్య పట్టే రైతులు ఐస్ దొరక్క నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
*కిలోకు రూ.40 తగ్గిన రొయ్యల ధర
మార్చి మొదటి వారంలో 30 కౌంట్ కిలో రొయ్యల ధర రూ.620 ఉండగా నేడు రూ.580కి తగ్గింది. ఇక 50 కౌంట్, 100 కౌంట్ ధరలు కూడా కిలోకు రూ.30 వరకూ తగ్గాయి. ఓ వైపు ఫీడ్, సీడ్, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీనికితోడు విద్యుత్ కోతలతో ఎకరాకు సాగు ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఇలా సాగు ఖర్చులు పెరిగిపోతుంటే రొయ్యల ధరలు తగ్గడం రైతులకు తీవ్ర నష్టాలు మిగల్చనుంది. రొయ్య సాగు మధ్యలో నిలిపివేయడం సాధ్యం కాదు. ఒక బ్యాచ్ మొదలు పెడితే వాటిని పట్టేంత వరకు ఎంత ఖర్చయినా భరించాల్సిందే. మధ్యలోనే సాగు నిలిపివేస్తే తిరిగి వచ్చేది సున్నా. ప్రస్తుతం రొయ్య రైతుల పరిస్థితి త్రిశంకుస్వర్గంలా తయారైంది. మార్చిలో రొయ్యలసాగు చేపట్టిన రైతులు మరో రెండు మూడు నెలలు వాటిని పెంచాల్సి ఉంది. నెల రోజుల నుంచి విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో రొయ్యలు సాగు చేయలేక, సాగు నిలిపివేయలేక రైతులు తీవ్ర మానసిన ఆందోళనకు గురవుతున్నారు. కనీసం 50 నుంచి 100 కౌంట్ వస్తే గాని రొయ్యలు పట్టడానికి వీలు కాదు. మార్చి నుంచి కొత్త బ్యాచ్ మొదలు పెట్టిన రైతులు విద్యుత్ కోతలతో తీవ్రంగా నష్టపోయారు. ఇంకా కరెంటు కోతలు కొనసాగితే పరిస్థితి ఏమిటో ఊహకందడం లేదని వారు గగ్గోలు పెడుతున్నారు.
*వేల కోట్లు ఆదాయం వస్తున్నా ఎందుకీ చిన్నచూపు!
ఆక్వాలో ఏపీకి మంచి బ్రాండ్ ఉంది. రాష్ట్రంలో 188 మండలాల్లోని 1533 గ్రామాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. 6 లక్షల మంది రైతులు, మరో 6 లక్షల మంది కూలీలు, కార్మికులకు ఉపాధి లభిస్తోంది. విదేశాల్లోనూ ఏపీ నుంచి ఎగుమతి అవుతున్న చేపలు, రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. ఏటా ఏపీ నుంచి 6 లక్షల టన్నులు ప్రాసెస్ చేసిన రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏటా ఏపీ నుంచి రూ.60000 కోట్ల విలువైన చేపలు, రొయ్యలు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా ఏపీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఏటా రూ.3000 కోట్ల ఆదాయం వస్తోంది. ఇలాంటి ఆక్వా రంగాన్ని ఆదుకోవాల్సి ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ కోతలతో నష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఆక్వా రైతులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి. లేదంటే రొయ్య సాగు తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం పొంచి ఉంది.