అనాథ, వృద్ధాశ్రమాలకు రూ.10 లక్షలు అందజేసిన సోహెల్‌

సయ్యద్‌ సోహెల్.. బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. విన్నర్ కాకపోయినా.. విన్నర్ అవ్వడానికి అన్ని క్వాలిటీలు సోహెల్ లో ఉన్నాయని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ లో సోహెల్ 25 లక్షల రూపాయలు సొంతం చేసుకున్నాడు. అప్పట్లోనే 10 లక్షలను సేవ కోసం పక్కన పెడతానని చెప్పిన సోహెల్ ఇప్పుడు మాట నిలబెట్టుకున్నాడు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి రూ.10 లక్షలు అందించాడు. అనంతరం సోహెల్‌ మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ద్వారా తనకు వచ్చిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథాశ్రమాలకు ఖర్చు చేస్తానని అన్నాడు. తాను నటించే ప్రతి చిత్రంలోను వచ్చే పారితోషికంలో 10 నుంచి 15 శాతం సేవకు వినియోగిస్తానని చెప్పాడు. బిగ్‌బాస్‌ షో ద్వారా జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ షో విన్నరైతే రూ. 10లక్షలు అనాథలకు కేటాయిస్తానని చెప్పగా.. బిగ్‌బాస్‌ షో హోస్ట్‌, ప్రముఖ సినీహీరో నాగార్జున సార్‌ తనను వారించి తనకు బదులు ఆయనే రూ. 10లక్షలు ఇచ్చారన్నాడు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనాథలకు సాయం చేయాలని కోరాడు. తాను పంచుతున్న చెక్స్ అన్నీ నాగార్జున గారు ఇచ్చిందేనని అన్నాడు సోహెల్.. ఆనాడు నాకు బిగ్ బాస్ లో వచ్చిన ప్రైజ్ మనీలో 10 లక్షలు ఇద్దామని అనుకున్నప్పుడు నాగార్జున నీకు ట్యాక్స్ కట్ అయిపోయి డబ్బులు చేతికి వచ్చే సమయానికి చాలా తక్కువ డబ్బు వస్తుందని.. ఆ డబ్బు బదులు తానే 10 లక్షలు నాగార్జున గారు ఇచ్చారని.. ఆయన ఎంతో గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని సోహెల్ తెలిపాడు.

రూ.10లక్షలను చెక్కుల రూపంలో మదర్స్‌ నెస్ట్‌ వృద్ధాశ్రమం(నేరేడ్‌మెట్‌), తబిత స్వచ్ఛంద సంస్థ(రామగుండం), పీపుల్‌ హెల్పింగ్‌ చిల్డ్రన్స్‌ సోషల్‌ ఆర్గనైజేషన్‌(ఆర్టీసీ క్రాస్‌రోడ్‌), జామియా మహదుల్‌ అష్రాఫ్‌(విజయవాడ) సేవాశ్రమాలతో పాటు మహ్మద్‌ మొయినుద్దీన్‌ కుటుంబానికి పంచారు. చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రూ.2లక్షల చెక్కు అందించారు. ఆశ్రమంలో కాసేపు గడిపి, అక్కడి వారికి భోజనం వడ్డించారు.