SRH vs RCB: కోహ్లీసేన వరుస విజయాలకు కళ్లెం.. ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ విజయం

ఐపీఎల్‌ ఆఖరి దశకు చేరుకున్నా కొద్ది మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మూడు ప్లేఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా, మరో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. ప్లేఆఫ్‌లోకి దూసుకెళ్లిన బెంగళూరుకు, రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది. పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో రైజర్స్‌ సమిష్టి ప్రదర్శనతో విజృంభిస్తే..బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో బెంగళూరు మూల్యం చెల్లించుకుంది. మొత్తంగా నాలుగో బెర్తు కోసం శుక్రవారం వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అబుదాబి: ఐపీఎల్‌లో ఆసక్తికర పోరు సాగుతూనే ఉంది. ఆఖరి ప్లేఆఫ్‌ బెర్తు ఎవరిదన్నది ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతున్న నేపథ్యంలో జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. అయితే ప్లేఆఫ్‌ బెర్తుతో సంబంధం లేకుండా బుధవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన రసవత్తర మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో గెలిచి ముందంజ వేద్దామనుకున్న కోహ్లీసేన ఆశలపై రైజర్స్‌ నీళ్లు గుమ్మరించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్‌సీబీ 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకు పరిమితమైంది. రైజర్స్‌ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఆర్‌సీబీ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. దేవదత్‌ పడిక్కల్‌(41), మ్యాక్స్‌వెల్‌(40) రాణించినా.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కోహ్లీ(5), క్రిస్టియన్‌(1), శ్రీకర్‌ భరత్‌(12) విఫలమవ్వడం ఆర్‌సీబీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించింది. రైజర్స్‌ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆర్‌సీబీ బ్యాటర్లు విఫలమయ్యారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 141/7 స్కోరు చేసింది. ఓపెనర్‌ జాసన్‌రాయ్‌(44)కు తోడు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(31) రాణించడంతో రైజర్స్‌ పోరాడే స్కోరు సాధించింది. మిడిలార్డర్‌లో ప్రియమ్‌ గార్గ్‌(15), అబ్దుల్‌ సమద్‌(1), సాహా(10), హోల్డర్‌(16) విఫలమయ్యారు. యువ పేసర్‌ హర్షల్‌ పటేల్‌(3/33) మూడు వికెట్లతో రాణించాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్న విలియమ్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఆర్‌సీబీ స్పీడ్‌స్టర్‌ హర్షల్‌ పటేల్‌(29) నిలిచాడు. గత సీజన్‌లో ముంబై పేసర్‌ బుమ్రా(27) పేరిట ఉన్న రికార్డును పటేల్‌ తిరుగరాశాడు. విలియమ్సన్‌, సాహా, హోల్డర్‌ వికెట్లు తీసి ఈ ఫీట్‌ అందుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: 20 ఓవర్లలో 141/7 (రాయ్‌ 44, విలియమ్సన్‌ 31, హర్షల్‌ పటేల్‌ 3/33, క్రిస్టియన్‌ 2/14),

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: 20 ఓవర్లలో 137/6(పడిక్కల్‌ 41, మ్యాక్స్‌వెల్‌ 40, మాలిక్‌ 1/21, కౌల్‌ 1/24).