సర్వభూపాల వాహనంపై శ్రీవారు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఎనిమిదో రోజు, శుక్రవారం ఉదయం స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. సర్వభూపాలుడు అంటే అందరూ రాజులేనని అర్థం. ఈ సర్వభూపాలకుల్లో దిక్పాలకులూ చేరుతారు. విష్ణు అంశలేనివాడు రాజు కాలేడు. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే అని వేదాల వర్ణన. శ్రీహరి రాజాధి రాజు. సర్వ భూపాలురూ వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కందాలపై మోస్తున్నారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్‌ సేవా పరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ ఇస్తోంది.