ఉక్కు ఉద్యమం.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారర ఆందోళనలు సాగాయి. విజయనగరం, తిరుపతిలో భారీ ర్యాలీలు నిర్వహించారు. ‘విశాఖ ఉక్కుా ఆంధ్రుల హక్కు’ అని, అటువంటి పరిశ్రమను ప్రయివేటుపరం చేస్తే ఊరుకునేది లేదంటూ నాయకులు, విద్యార్థులు నినదించారు. విజయనగరంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేష్‌ మాట్లాడారు. సాలూరులో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో ఎఎస్‌ జూట్‌మిల్లు కార్మికులు, ఆటో కార్మికులు, కళాసీలు నిరసన తెలిపారు. పార్వతీపురం, నెల్లిమర్ల, కొమరాడలో కార్మికులు నిరసన తెలిపారు.

తిరుపతిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు..’కడప ఉక్కును సాధించుకుంటాం.. విశాఖ ఉక్కును రక్షించుకుందాం’ అని నినదించారు. 16న కడపలో ప్రదర్శన చేపట్టనున్నామని నాయకులు తెలిపారు. యాదమరిలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. 18న జిల్లా కేంద్రంలో రిలే దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.18న జరిగే పోరాటంలో ప్రజలందరూ పాల్గనాలని వక్తలు పిలుపునిచ్చారు.తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు వనమాడి వెంకటేశ్వరరావు, వామపక్షాల నాయకులు పాల్గన్నారు. 15న గుంటూరు నుంచి బైక్‌ ర్యాలీ జిల్లాకు వస్తుందని, ర్యాలీని అందరూ విజయవంతం చేయాలని కోరారు. విశాఖ ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్ర తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీధర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్కు పరిరక్షణ పోరాటంలో విజయవాడ నగరంలోని పన్ను చెల్లింపుదారులందరూ పాల్గనాలని ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని లైం స్టోన్‌ మైన్స్‌ మెయిన్‌ గేటు వద్ద అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. గుంటూరులో ప్రజాసంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు.14న చలో విశాఖను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెనాలిలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామంటూ అమరావతి రైతులు రిలే దీక్షలు చేపట్టారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల వద్ద కొవ్వొత్తులు వెలిగించి జై అమరావతి, ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు.