ఖరీఫ్ పంటలకు చెరువులు ఆదుకునేలా చర్యలు చేపట్టాలి..!

  • జిల్లాలోని ప్రాజెక్టుల నీటితో చెరువులు నింపి రైతులకు అందించాలి
  • బలహీనమైన గట్లు, కానాలు, మదుములు, షట్టర్లు, చప్టాలు, పర లకు మరమ్మతులు చేపట్టాలి
  • డా.వైఎస్సార్ జలకళకు పూర్తి స్థాయిలో జీవం పోయాలి
  • ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు చెరువులు ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర చర్యలు పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. గురువారం ఆ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహ చక్రవర్తి, పార్వతీపురం మండల అధ్యక్షులు బలగ శంకర్రావు, ఉపాధ్యక్షులు అన్నా భత్తుల దుర్గాప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లి వెంకటరావుతో కలిసి ఈ ఏడాది ఖరీఫ్ కష్టాలు గూర్చి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, మందకోడిగా కదులుతుండడంతో వర్షాలు బొటాబొటి గా ఉన్నాయన్నారు. ఈపాటికే ఉబాలు పనులు ముమ్మరంగా జరిగి ఉండేవని, అటువంటిది ఈ ఏడాది వర్షాలు ఎడపెట్టడంతో కొన్ని ప్రాంతాలలో నారుమల్లు కూడా ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటి రుతుపవనాల దోబూచులాట చూస్తే ఈ ఏడాది వర్షాలపై అనుమానం కలుగుతుందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులకు చెరువుల నీరే దిక్కయ్య పరిస్థితి నెలకొందన్నారు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలోని చెరువుల నీరు రైతుల ఖరీఫ్ పంటలకు ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనిలో భాగంగా చెరువుల్లో నీరు బయటికి వృధాగా పోకుండా ఉండేందుకు బలహీనంగా ఉన్న చెరువు గట్లు ను బలంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మరమ్మతులకు గురైన చెరువులు, కానాలు, మధములు, షట్టర్లు, చప్టాలు, చెక్ డ్యామ్ లు, చెరువు పర లు తదితర వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి రైతుకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే జిల్లాలో ఉన్న జంఝావతి, తోటపల్లి, వేగవతి, గోముఖి, సువర్ణముఖి, చంపావతి, వట్టిగెడ్డ, పెదంకలాం, సీతానగరం ఆనికట్, పారాది, సురా పాడు, ఆండ్ర, గోస్తని తదితర ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేసి వాటి సమీపంలో ఉన్న చెరువులను ప్రాజెక్టుల నీటితో నింపి చెరువుల్లో నిల్వ చేసిన నీటితో రైతుల పంటలకు సమయానికి నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, పాలకులు ముందు చూపుతో ఈ ఖరీఫ్ ను గట్టెక్కించాలని వారు కోరారు. దీనిపై పాలకులు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు ఉపయోగపడేలా డాక్టర్ వైయస్సార్ జలకళకు జీవం పోయాలన్నారు.