అధిక ఫీజు వసూలు చేసే ప్రైవేటు హాస్పిటల్స్ కు చెక్ పెట్టనున్న తెలంగాణా ప్రభుత్వం

కరోనా వైరస్ రోజు రోజుకి వేగంగా పెరుగుతున్న వేళ ఈ భయంకర పరిస్థితిని సైతం సొమ్ము చేసుకొంటున్న కార్పొరేట్‌ ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు తీసుకోనుంది. కరోనా బాధితుల నుంచి అమానుషంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ.లక్షల చొప్పున ఫీజు వసూలు చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు మరణించినా మిగతా రూ.లక్షల బిల్లును చెల్లించాల్సిందేనని, లేదంటే శవాన్ని అప్పగించేది లేదని పెద్ద పెద్ద  ఆస్పత్రులు నిబంధనలు విధించిన ఘటనలు వెలుగులోనికి రాగా… వీటి ఆటలు కట్టిపెట్టేందుకు కఠిన చర్యలు తీసుకొనే దిశగా  వైద్యారోగ్య శాఖ అడుగులు వేస్తుంది.

కరోనా చికిత్సకు అత్యధిక బిల్లులు దారుణంగా వసూలు చేస్తున్న ఆసుపత్రులకు కరోనా చికిత్సల అనుమతుల్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాంటి ఫిర్యాదులు వస్తున్న ఆసుపత్రులపై ఆకస్మిక తనికీలు నిర్వహించి, రికార్డులు పరిశీలించి, ఓ నిర్ణయానికి రానుంది. ఈ చర్యలను అమలు చేసేందుకు బృందాలను సిద్దం చేసి ప్రభుత్వం నియమించింది. రెండు, మూడు రోజుల్లో ఈ బృందాలు ఎక్కువ ఫిర్యాదులున్న ఆసుపత్రుల్లో ఆకస్మిక దాడులు చేస్తాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.