ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వండి..

రాష్ట్ర విభజన సమయంలో రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకు పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విజయసాయి శనివారం ఈ నివేదికను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడికి అందించారు. ”భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని అనుసరించి ఇదివరకు ఉన్న జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం ప్రత్యేకస్థాయితో పాటు, ప్రత్యేక కేటగిరీ హోదాను అనుభవించింది. ఇప్పుడు ఆర్టికల్‌ 370, 35ఎలను రద్దు చేయడంతో పాటు… జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్రానికి ఇక ఏ మాత్రం ప్రత్యేక కేటగిరీ హోదా కొనసాగే అవకాశం లేదు. అయితే 2021-22 కేంద్ర బడ్జెట్‌లో జమ్మూకశ్మీర్‌కు రూ.1.08 లక్షల కోట్లు, లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించినట్లు స్థాయీ సంఘం గమనించింది. భారీగా పెంచిన కేటాయింపుల వల్ల రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తగినంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రాజధానిని కోల్పోయినందున లద్దాఖ్‌కు ఎదురయ్యే ప్రతికూలతలను భర్తీ చేయడానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లకు 2021-22 బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరపడాన్ని కమిటీ అభినందిస్తోంది. అదే తరహాలో రాష్ట్ర విభజన సమయంలో రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకూ ఇలాంటి పరిహారం ఇస్తే బాగుంటుందన్నది కమిటీ భావన. ఈ మూడు రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా ప్రకటించాలని కమిటీ సిఫార్సు చేస్తోంది. దాని వల్ల ఆయా రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి, వాణిజ్యం, ఎగుమతుల మౌలిక వసతుల పరంగా ఆర్థికాభివృద్ధి చెందడానికి వీలవుతుంది…” అని కమిటీ పేర్కొంది.