మద్దతు ధర కాదు … మోసపు ధరతో రైతులను ముంచేస్తున్నారు

* ధాన్యం కొనుగోలు కుంభకోణంపై ప్రశ్నిస్తే బెదిరింపులు
* మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆవేదన వ్యక్తం చేసిన ప్రకాశం జిల్లా రైతు ప్రతినిధులు

అన్నం పెట్టే రైతన్న రాష్ట్రంలో బహిరంగంగా మోసపోతున్నాడని, కర్షకుడు తన కష్టాన్ని అమ్ముకునే క్రమంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అతడి కష్టం దోచుకుంటున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొనేందుకు మంగళగిరి వచ్చిన ఆయనను ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం నుంచి శ్రీమతి కేశవరపు కవిత ఆద్వర్యంలో రైతు ప్రతినిధులు శనివారం వచ్చి కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు లో జరుగుతున్న అక్రమాలు, మోసాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వారు మిల్లర్లతో కుమ్మక్కై రైతుని ముంచేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు రైతుకి కనీస ధర ఇవ్వకుండా నష్టపరుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనిపై గడప గడపకు కార్యక్రమంలో అడిగితే బెదిరింపులకు దిగారని ఆవేదన చెందారు. ధాన్యం కొనుగోళ్లలో క్షేత్రస్థాయి పరిస్థితిని విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “క్వింటాలు ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఏ మాత్రం రైతుకు అందడం లేదు. రైతులకు అండగా ఉండాల్సిన రైతు భరోసా కేంద్రాలు వాళ్లను మభ్యపెట్టి సగం ధరకే అమ్ముకునేలా చేస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బంది మిల్లర్ల తో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు. తేమ ఎక్కువ శాతం ఉందని, బియ్యం రంగు మారాయని, నూక వస్తోందని రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇవ్వాల్సిన మద్దతు ఇవ్వడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. మిల్లర్లు యధేచ్ఛగా క్షేత్రస్థాయిలో చెలరేగి పోతున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో మిల్లర్లే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, మిల్లర్లు ఓ ముఠా గా ఏర్పడి మొత్తం తతంగం నడిపిస్తున్నారు. క్వింటా ధాన్యానికి రైతులకు కేవలం తొమ్మిది వందల రూపాయల ధర మాత్రమే దక్కుతుంది. దీనిలోనూ రవాణా ఛార్జీలు, కూలీల ఖర్చు, గోతం ఖర్చులు కింద మళ్ళీ150 రూపాయలను మిల్లర్లు తీసుకుంటున్నారు. అంటే రమారమి క్వింటా కు రైతులకు దక్కే ధర కేవలం రూ.850 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ధాన్యం కొనుగోలు డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారు. కేవలం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం లో రెండు వేల మంది రైతులు ఇలా నష్టపోయారు అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత మంది కర్షకులు దీనిలో నష్టపోయారు అర్థమవుతోంది. దీనిపై రైతుల తరపున జనసేన పార్టీ పోరాడుతుంది. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ దీనిపై చర్చించి ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై ఓ ప్రణాళిక ప్రకారం అన్నదాతకు న్యాయం జరిగేలా పోరాడుతాం.


* గడప గడపకు వెళ్తే జేజేలు కొడతారని ఎలా అనుకున్నారు?
గడప గడపకు కార్యక్రమంలో దోపిడికి గురవుతున్న రైతుల తరఫున మాట్లాడిన రైతు ప్రతినిధులపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు వ్యక్తిగతంగా దాడులు చేయడం, ఆడబిడ్డలను కించపరిచేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదు. ఆడబిడ్డలు కన్నీరు పెట్టడం సమాజానికి మంచిది కాదు. మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు అనుకంటే గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టకుండా ఉండాల్సింది. గడప గడపకు కార్యక్రమానికి ప్రతికూలత ఉండదు అనుకుంటే ఎలా? అందరూ మీకు జేజేలు కొట్టరు. కొంతమంది సమస్యల మీద నిలదీస్తారు కూడా. సమస్యలపై నిలదీసిన వారిపై దాడులు చేస్తాం… వ్యక్తిగతంగా దూషిస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతు ప్రతినిధులకు అండగా ఉంటాం. వ్యక్తిగతంగా దూషణలకు దిగే వారికి ఒకటే చెబుతున్నాం… ప్రభుత్వాలు మారుతాయి గుర్తు పెట్టుకోండి. స్థానిక సివిల్ సప్లయ్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై దృష్టిసారించాలని కోరుతున్నానని” అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో దాసరి నరేష్, డాక్టర్ ఎమ్. ప్రసన్నకుమార్, కాట్రగడ్డ రఘు ఉన్నారు.

* శ్రీ పవన్ కళ్యాణ్ ని కలిసిన బీసీ సంక్షేమ సంఘం, మాల మహానాడు ప్రతినిధులు
జాతీయస్థాయిలో బీసీలకు కచ్చితంగా న్యాయం జరగాలని, సామాజిక వర్గాల వారీగా లెక్కలు తేలితేనే అది సాధ్యమని తెలుపుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కేశన శంకరరావు ఆధ్వర్యంలో బీసీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. మాల మహానాడు ప్రెసిడెంట్ శ్రీ గుర్రం రామారావు ఆధ్వర్యంలో ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతికి ఉద్దేశించిన పథకాలను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.