ఉమ్మడి కడప జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు

* పులివెందుల నియోజకవర్గంలోనే 13 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు
* ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం
* జనసేన ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రభుత్వం చేసిన కుట్రే కోనసీమ అల్లర్లు
* చిత్తశుద్ధిగల నాయకుల్ని తయారు చేసే గొప్ప వేదిక జనసేన
* ప్రజల్లోకి నేరుగా వెళ్లి.. సమస్యలపై నాయకులు పోరాడాలి
* జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాందెండ్ల మనోహర్

నాయకులు ఊరికే అయిపోరు.. దానికి ఒక విజన్, పట్టుదల, ఓపికతోపాటు మానవత్వం, ఉన్నతంగా ఆలోచించే హృదయం ఉండాలని, అవన్నీ ఉన్న గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. చిత్తశుద్ధిగల నాయకుల్ని తయారు చేసే గొప్ప వేదిక జనసేన పార్టీ అని, దానిని ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలన్నారు. జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత రెండున్నరేళ్లు ఎలాంటి విమర్శలు చేయకూడదు అని మొదట అనుకున్నాం.. అయితే ఈ ప్రభుత్వం అంతటి సమయం మనకు ఇవ్వలేదు. కేవలం 6 నెలల్లోనే ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు, మరోవైపు ప్రజల సమస్యలు చుట్టు ముట్టాయి. ఈ సమయంలో ప్రభుత్వంతో పోరాడాలని, ప్రజా పక్షం తీసుకోవాలని నిర్ణయించాం. వైసీపీని నమ్మి 151 మంది శాసన సభ్యులను గెలిపిస్తే , ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఈ ప్రభుత్వానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రజా సమస్యల మీద జనసేన చేసిన పోరాటాలకు ప్రజల మద్దతు లభించింది. వారి ఆవేదన జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం ఏర్పడింది.
* పులివెందుల కౌలు రైతు కుటుంబాలను ఆదుకుంటాం
ఏప్రిల్ 5వ తేదీన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రైతుల సమస్యల మీద చర్చ పెట్టాం. కౌలు రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడుకున్నాం. దీనిపై పూర్తిస్థాయిలో స్పందించి, చలించింది మాత్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఆలోచనలు, ఎలా సాయపడాలి అనే మథనం నుంచి వచ్చిన కార్యక్రమమే జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర. ఇప్పటికే మూడు జిల్లాల్లో మొదటి విడత పూర్తి చేసుకున్నాం. తరువాత ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనూ గత మూడేళ్లలో 132 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోనూ 13 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అక్కడి వారికి కూడా జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతాం. సమావేశం ఏర్పాటు చేసి, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటాం. పెట్టిన పెట్టుబడి రాక.. ధర గిట్టక.. అప్పుల వారికి సమాధానం చెప్పుకోలేక రైతులు తనువు చాలిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోని రైతుల బాధే పట్టని ఈ ముఖ్యమంత్రి తీరు- తల్లికి అన్నం పెట్టలేడు కాని.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడు అన్న చందాన ఉంది. జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టన తరువాతే కొంతమంది కౌలు రైతుల కుటుంబాలకు మాత్రం రూ. 7 లక్షల నష్ట పరిహారం అందింది. ఇది కచ్చితంగా జనసేన పార్టీ విజయమే.


* ప్రజాబలం లేకే కులాల మధ్య చిచ్చు
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఈ ప్రభుత్వం ఆరాటపడుతోంది. అయితే ప్రజాబలం లేక, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే దారి లేక కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పన్నింది. దీనిలో భాగమే కోనసీమ అల్లర్లు. ఓ ప్రణాళిక ప్రకారం చేసిన దుశ్చర్య ఇది. ఇంతటి ఘటన జరిగితే కనీసం ముఖ్యమంత్రి నుంచి ఒక ప్రకటన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జనసేన పార్టీ కోనసీమ అల్లర్ల విషయంలో బాధ్యతాయుతంగా స్పందించింది. సంఘటన జరిగిన వెంటనే అక్కడున్న పరిస్థితిని చక్కదిద్దేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడారు. ప్రశాంతత తీసుకురావడానికి అందరూ సంయమనం పాటించాలని కోరారు. కోనసీమతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకీ బలపడుతున్న జనసేన పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్ర కోనసీమ అల్లర్లు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కుట్రలను ప్రజలే తిప్పికొడుతున్నారు. అధికార పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు అనంతబాబుపై పడిన హత్య కేసు మరకను తప్పించేందుకు, ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ చేసిన అత్యంత దారుణమైన కుట్ర కోనసీమ అల్లర్లు. దీనివల్ల సామాన్యులు బాధ పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఇంటర్ నెట్ రాక ఇబ్బందులు పడుతున్నారు.
* అమాయకులపై పోలీసు కేసులు పెడితే సహించేది లేదు
కోనసీమ అల్లర్ల ఘటనలో నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప రాజకీయంగా కొందర్ని ఎంచుకొని వేధించాలనే తలంపుతో అమాయకులపై పోలీసు కేసులు పెడితే కచ్చితంగా జనసేన లీగల్ విభాగం దానిపై పోరాడుతుంది. బాధితుల తరఫున వారికి భరోసానిస్తుంది. 6 రోజుల క్రితం రాష్ర్టంలో శాంతి భద్రతలు, కోనసీమ అల్లర్ల విషయాన్ని మాట్లాడేందుకు డీజీపీను అపాయింట్మెంట్ అడిగాం. ఈ-మెయిల్స్, వివిధ రకాలుగానూ గుర్తు చేశాం. కనీసం ఆయన నుంచి స్పందన లేదు. ఒక పార్టీ అధ్యక్షుడు డీపీజీని కలిస్తే తప్పేం ఉంది. ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం..? డీజీపీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు మంచి అధికారి అని పేరుంది. మరి ఆయనను నియంత్రిస్తుంది ఎవరు..? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉదయమే దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశాం.
* అందర్నీ కలుపుకొని వెళ్దాం.. పార్టీని మరింత బలోపేతం చేద్దాం
పార్టీ నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తితో అది సాధ్యం కాదు. సమష్టిగా కష్టపడితేనే మనం పార్టీని అద్భుతంగా నిర్మించుకోగలం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మీ పరిధిలో పార్టీ కోసం ఎంత మేర కష్టపడుతున్నాం..? మన వల్ల పార్టీకి ఎంత మేలు జరుగుతోంది అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. తెలిసో, తెలియకో, కోపంలోనో, ఆవేశంతోనో, ఈగోలతోనో పని చేయకండి. ఓ నిర్ణయం తీసుకునే సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. క్రమశిక్షణ గల గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం. అందర్నీ కలుపుకొని వెళ్లండి. పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలంటే ఎవరో ఏదో చెప్పరు… మీరే నిర్ణయాలు తీసుకోండి. అది నాయకులతో చర్చించండి. అంతా కలిసి ముందుకు వెళ్లండి. పార్టీకి మీ చర్య వల్ల చిన్న డామేజ్ జరిగినా దాన్ని మళ్లీ పూడ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ‘ఆశ వదులుకుంటే ధైర్యంగా ముందుకువెళ్లలేం’ అనే ఈ మాటను గుర్తుంచుకొని పనిచేయండి. జెండా పట్టుకొని తిరిగే ధైర్యమున్న జనసైనికుల్ని, వీర మహిళలను వదులుకోవద్దు. వారికి తగిన గౌరవం ఇవ్వండి. చిన్న విషయాలకు గొడవలు పడకుండా, సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టండి. సోషల్ మీడియాలో హడావుడి చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో తిరగండి. సమస్యలు అర్థం చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడండి. ఒకే గొడుగు కింద అంతా పనిచేద్దాం. ఎవరో వచ్చి మేం నాయకులు, జనసైనికులం అంటే నమ్మాల్సిన పనిలేదు. దీనిని గుర్తుంచుకోండి.
* 10, 11 తేదీల్లో క్రియాశీలక సంబరాలు
ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అనుమానాలు, అవమానాలు తట్టుకొని నిలబడిన ఓ గొప్ప ప్రస్థానం మనది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 3.50 లక్షల మంది క్రియాశీలక సభ్యుల సభ్యత్వాలు పూర్తి అవ్వడం ఎంతో సంతోషం. సభ్యత్వ నమోదులో 7967 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేశారు. వారందరినీ మనం గౌరవించుకోవాలి. ఈ నెల 10, 11 తేదీల్లో జనసేన పార్టీ క్రియాశీలక సంబరాలు చేసుకుంటున్నాం. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలకు పార్టీని తీసుకువెళ్లడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కచ్చితంగా పార్టీ పట్ల ప్రజల్లో గౌరవభావం ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా నాయకులు, జనసైనికుల్ని ప్రోత్సహించండి. ఈ సారి క్రియాశీలక సభ్యులకు పవన్ కళ్యాణ్ మనోగతం పేరుతో ఓ బుక్ ఇస్తున్నాం. పార్టీ ఐడియాలనీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తెలిసేలా పుస్తకం తయారైంది. మనం కనిపించకపోయినా, మన పనులు కనిపించాలి అనే బలమైన ధ్యేయంతో పార్టీ కోసం పనిచేస్తే త్వరలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడొచ్చు” అన్నారు.