ముంచుతున్నది వరద కాదు.. నిర్లక్ష్యం!

* బాధితుల బాధలు పట్టని జగన్‌ ప్రభుత్వం
* ఆహారం సైతం అందించలేని అలసత్వం
* ముందు జాగ్రత్త చర్యలు లేనేలేవు
* ముంపు ప్రాంతాల్లో జనం గగ్గోలు
* ఆకలితో అలమటిస్తున్న ముంపు బాధితులు

వర్షాకాలం వస్తోందంటే గుడిసెలో ఉండే వాడు కూడా కంతలు పూడ్చుకుంటాడు. ఆ మాత్రం ఇంగితం కూడా జగన్‌ ప్రభుత్వానికి కొరవడిందని చెప్పడానికి ఇప్పుడు గోదావరి వరదల్లో చిక్కుకున్న వందలాది గ్రామాల దుస్థితే నిలువెత్తు దర్పణం. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయనగానే దిగువ ప్రాంతాల ముంపు గురించి ఆలోచించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే అప్రమత్తత ప్రభుత్వ వర్గాలలో కొరవడడం వల్లనే రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు వరదలో చిక్కుకుని అలమటిస్తున్నారు. ముందు జాగ్రత్తలు సంగతి అలా ఉంచితే, వరదలు ముంచెత్తాక సైతం ముంపు ప్రాంతాల జనానికి కనీసం ఆహారం అందించాలనే స్పృహ కూడా జగన్‌ ప్రభుత్వానికి కొరవడింది. ఫలితం… వేలాది మంది జనం అరకొర సాయం ఏమూలకీ చాలక ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు.
ప్రభుత్వం ప్రకటనను బట్టి చూసినా భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల 5 జిల్లాల్లోని 165 గ్రామాల పరిధిలో 59,135 మంది ప్రభావితులయ్యారు. అయితే వాస్తవానికి బాధితుల సంఖ్య ఇంతకు ఎంతో అధికమని తేలుతోంది. వరదలకు ప్రభావితమయిన వారిలో 46,079 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే అధికారుల లెక్కలకు పొంతన లేని ఆకలి కేకలే అంతటా వినిపిస్తున్నాయి. ముంచెత్తిన వరదల వల్ల అనేక గ్రామాల ప్రజలు అప్పటికప్పుడు హడావుడి పడి అందిన తట్టాబుట్టా పట్టుకుని ఎత్తయిన ప్రాంతాలకు చేరుకున్నారు. మరి కొందరు పునరావాస కేంద్రాలకు చేరారు. ఇల్లు వాకిలి వదిలేసి, ఉన్నపళంగా సురక్షిత ప్రాంతాలకు తరలిన ప్రజలకు ఎదురయ్యే బాధలేంటో, వారి కనీస అవసరాలు ఎలా తీర్చాలో కూడా పట్టనంత ఉదాసీనత, నిర్యక్ష్యం అధికారుల్లో పేరుకుపోయిందని చెప్పడానికి బాధితుల ఆక్రందనలే సాక్ష్యం.
* ఏదీ అప్రమత్తత?
నిజానికి భద్రాచలంలో గోదావరి వరద పెరిగిందనగానే, రాష్ట్రంలో అధికారులు అప్రమత్తం అవాలి. పై నుంచి వరద నీరంతా దిగువకు వస్తుందనగానే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం, వారికి కావలసిన ఆహార అవసరాలపై ముందుగానే సామగ్రిని సిద్ధం చేసుకోవడం జరగాలి. కానీ అవేమీ సరిగా జరగలేదని చెప్పడానికి వరదలొచ్చి వారం రోజులవుతున్నా బాధితుల అవస్థలు తీరకపోవడమే ప్రబల సాక్ష్యం. అధికార వర్గాలు పరుగులు పెడుతూ పని చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి అమాత్యుల దగ్గర నుంచి ప్రజా ప్రతినిధుల వరకు తక్షణ పర్యవేక్షణ జరగాలి. కానీ పై నుంచి కింద వరకు నిర్లక్ష్యం, ఉదాసీనత పేరుకుపోవడంతోనే వరద బాధితుల కష్టాలు హృదయవిదారకంగా మారాయి. ఇదంతా చూస్తే బాధితులను ముంచింది గోదావరి కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యమేనని చెప్పడానికి ఎన్నో ఉదాహరణకు కనిపిస్తున్నాయి.
* ముంపు ప్రాంతాలలో చిక్కుకుని అలమటిస్తున్న బాధితులను ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నమంత్రులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ పరామర్శించక పోవడం అనేక చోట్ల కనిపించింది. నిజానికి ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా బాధిత ప్రాంతాలను సందర్శించి అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తే పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది. అలాంటిది ఎప్పుడూ ‘నా ప్రజలు, నా బడుగు జీవులు’ అంటూ ఉపన్యాసాలు దంచే ముఖ్యమంత్రి జగన్‌ బాధిత ప్రాంతాల కేసి కన్నెత్తయినా చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆయనకే లేకపోతే, మంత్రులు మాత్రం అందుకు భిన్నంగా ఎందుకుంటారు? గోదావరి వరద ప్రభావం అధికంగా ఉన్న అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన అయిదుగురు మంత్రులతో పాటు ఇంఛార్జి మంత్రులు కూడా ఉన్నా వారు పూర్తిస్థాయిలో వరద ప్రాంతాల్లో స్వయంగా పరిశీలన చేసిన పాపాన పోలేదు. మంత్రులు విశ్వరూప్‌, వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత మాత్రమే కాస్తో కూస్తో పర్యటించారంతే. మిగతా వారెవరూ వరద ప్రాంతాల కేసి రానేలేదంటే వైకాపా ప్రభుత్వానికి ప్రజల బాధలంటే ఎంత చులకనో అర్థమవుతోందని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న జనం బాధలు పట్టించుకోవడం కన్నా ముఖ్యమైనపనులేముంటాయనే ప్రశ్నకు దురదృష్టవశాత్తూ సమాధానం చెప్పే నాధుడే లేడు.
* చుట్టూ నీటిలో చిక్కుకునో, పునారావాస కేంద్రాల్లో అరకొర వసతుల మధ్యనో బిక్కుబిక్కుమంటున్న బాధితులకు ఆహార పొట్లాలు అందిచాల్సింది పోయి… ‘సరుకులిస్తాం, వండుకుని తినండి’ అనే మొక్కుబడి చర్యలను తొలిసారిగా చూస్తున్నామంటూ ముంపు బాధితులు వాపోతున్నారు. పోనీ ఆ సరుకులైనా పుష్కలంగా అందించారా అంటే అదీ లేదు. వరద బాధితుల్లో కేవలం 30 శాతం మందికే అదికూడా అరకొరగా మాత్రమే అందించారని బాధితులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వారం నుంచి వరదలు ముంచెత్తితే మూడు రోజుల తర్వాత నుంచే ఆ సరుకులైనా ఇస్తున్నారంటే నిర్లక్ష్యం ఎంత మేరకు పేరుకుపోయిందో వేరే చెప్పక్కరలేదు. కొందరికి బియ్యం, కందిపప్పు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. మరి కొందరికి ఏడు దుంపలు, పది ఉల్లిపాయలు, కాసిని దొండకాయలు ఇచ్చి వాటాలేసి తీసుకోండని చేతులు దులుపుకున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. బాధితులకు వంట సామగ్రి లేదు. ఉప్పూ కారం లాంటి దినుసులు లేవు. చుట్టూ నీటిలో, తేమ వాతావరణంలో ఎలా వండుకుని ఎలా తింటారనే ఇంగితం కూడా అధికారులకు లేకపోయిందని అనేక ప్రాంతాల్లో దుస్థితిని బట్టి తెలుస్తోంది.
* పక్క రాష్ట్రమైన తెలంగాణలో వరదలను తక్షణం ఎదుర్కోడానికి వీలుగా అత్యవసర సహాయ చర్యలకు రూ. 500 కోట్లను కేటాయించారు. ఆమాత్రం ఆలోచన కూడా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్‌ కు కొరవడిందని అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. తినడానికి తిండి దొరక్క, తాగడానికి మంచి నీరు సైతం అందక రాష్ట్రంలో వేలాది మంది ముంపు బాధితులు అలమటిస్తున్నారు.
* అక్కడక్కడా అన్నం పెడుతున్నా అది చిమిడిపోయి ఉంటోందని, నీళ్ల చారు పోసి అయిందనిపిస్తున్నారని వరద ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే… వరద బాధిత కుటుంబాల్లో ఎంత మంది సభ్యులున్నా, ఒక రేషన్‌ కార్డుకు ఒక భోజన పొట్లమే ఇస్తున్నారనే ఆక్రందనలు ఉన్నాయి. వరదలకి కొంపా గూడూ వదిలేసి ఎక్కడెక్కడో తలదాచుకుని ఆకలికి అలమటిస్తున్నప్రజలకు అన్నం పెట్టడానికి రేషన్‌ లెక్కలేసుకునే ప్రభుత్వాన్నిఇప్పుడే చూస్తున్నామని జనం బహిరంగంగానే తిట్టిపోస్తున్నారు.
* బాధితుల్లో పిల్లలకు కనీసం పాలపేకట్లు అందించని దారుణ పరిస్థితి అనేక చోట్ల కనిపిస్తోంది. పునరావాస కేంద్రాల్లో అన్నం వండించి అందించాల్సిందిపోయి, సరుకులిచ్చి చేతులు దులుపుకుంటే ఎలా వండుకోవాలని వాపోతున్న బాధితుల ఆవేదనకు సమాధానం చెప్పే నాధుడు లేడు. ఒకో ప్రాంతంలో ముంపు బాధితుల కష్టాలు ఒకో రకంగా ఉన్నాయి. మొత్తానికి అందరూ నానా పాట్లూ పడుతున్నారనేది వాస్తవం.
* సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంకలో వారం నుంచి ముంపు ఉండగా రెండు రోజుల నుంచి మాత్రమే తాగునీరిచ్చారంటే అధికారుల అలసత్వం ఎలాంటిదో అర్థమవుతోంది. ఈ ప్రాంతంలోని ఓ ఎన్‌ జీ సీ కాలనీ, కొత్తలంక, పల్లెపాలెం ప్రాంతాల్లో నీళ్లు చేరడంతో స్థానికులు చిన్న పడవల్లో బయటకు వచ్చి సరుకులు కొనుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో ఎవరికీ ఆహార పొట్లాలు అందలేదు.
* మామిడికుదురు మండలం అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నం, పెదపట్నంలంక గ్రామాల్లో 4577 మంది కుటుంబాలు ముంపులో చిక్కుకున్నా కేవలం 650 మందికి మాత్రమే ఆహర పొట్లాలు అందాయి. అప్పనపల్లి స్నానాల రేవు దగ్గర 300 మంది బాధితులుండగా, రేషన్‌ కార్డుకి ఒకటి వంతున కేవలం 50 పొట్లాలు మాత్రమే ఇవ్వడంతో వారంతా ఆందోళనకు దిగారు.
* కోనసీమలోని 71 లంక గ్రామాల్లో 24,640 పశువులు ఉన్నప్పటికీ వాటికి గ్రాసం అందించే చొరవను ఏ అధికారీ చూపించలేదు.
* ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట ప్రాంతంలో అయితే 400 కుటుంబాల వారు అప్పటికప్పుడు కొండపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవలసి వచ్చింది. వీరికి ఆహార పొట్లాలు లేవు సరికదా, రేషన్‌ కార్డు లెక్కలేసి కేవలం 50 కుటుంబాలకు సరిపడా కూరగాయల సంచులు ఇవ్వడంతో బాధితులంతా కలిసి తీవ్ర ఆగ్రహావేశాలతో ఎమ్మెల్యేను నిలదీశారు.
* ఇక ముంపునకు గురయిన లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇలా ప్రతి ముంపు ప్రాంతంలో ప్రజల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి.
* ప్రతి 50 ఇళ్లకొక వాలంటీరు చొప్పున ఉన్నా వారి ద్వారా సహాయ చర్యలు ముమ్మరం చేసే ప్రయత్నాలు కూడా ఎక్కడా కనిపించలేదు.
ఒక ఉపద్రవం వచ్చినప్పడు తక్షణమే స్పందించి, పర్యవేక్షణ చేయడం ద్వారా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాల్సిన ముఖ్యమంత్రి జగన్‌ వరద బాధితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఇంత దారుణంగా తయారయిందనేది చేదు నిజం. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించినంత మాత్రాన పరిస్థితులు చక్కబడవని, నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ యుద్ధప్రాతిపదిక మీద పని చేయిస్తేనే వరద బాధితులకు సక్రమ సాయం అందుతుందని అందరికీ తెలుసు. కానీ ఆ సంగతి ముఖ్యమంత్రికి మాత్రం ఇప్పటి వరకు పట్టినట్టులేదనేదే పరిశీలకుల ఆవేదన.