టీ20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం సాధించిన బంగ్లాదేశ్‌కు స్కాట్లాండ్‌ జట్టు షాక్‌ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో స్కాట్లాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ జట్టులో క్రిస్‌ గ్రీవ్స్‌ (45), మున్సే(29), మార్క్‌ వాట్‌(22) రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మహేది హసన్‌ మూడు, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షకిబ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో బంగ్లా జట్టు 6 పరుగుల తేడాతో పసికూన స్కాట్లాండ్‌పై ఓడింది. ముష్‌ఫికర్‌ రహిమ్‌(38) రాణించగా, షకిల్‌ అల్‌ హసన్‌(20), మహ్మదుల్లా(23) ఫర్వాలేదనపించారు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో బంగ్లాదేశ్‌ ఓటమి పాలైంది. స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్లీ వీల్‌ మూడు వికెట్లు, క్రిస్‌ గ్రీవ్స్‌ రెండు, జోష్‌ డేవి, మార్క్‌ వాట్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు జరిగిన మరో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో పపువా న్యూగినియాపై ఒమన్‌ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ జట్టు వికెట్‌ కోల్పోకుండా 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.