విజయానికి చేరువలో టీమిండియా

బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 195 పరుగులకు ఆలౌట్‌ చేసిన రహానే సేన.. 326 పరుగులు చేసి 131 పరుగుల విలువైన ఆదిక్యాన్ని సాధించింది. అనంతరం మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ తలా ఒక వికెట్‌ తీయగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించి ఆస్ట్రేలియా జట్టు నడ్డి విరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారు. 60 ఓవర్లు ఆడిన ఆసీస్‌ 122 పరుగులు చేసి కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టెయిలెండర్లు కామెరూన్‌ గ్రీన్‌ (9), పాట్‌ కమిన్స్‌ (12) క్రీజులో ఉన్నారు. భారత్‌ కంటే ఆసీస్‌ జట్టు ఇంకా 9 పరుగుల వెనుకబడి ఉంది. దాదాపుగా రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.